Begin typing your search above and press return to search.

రియాల్టీకి భారీ దెబ్బేయ‌నున్న పెద్ద నోట్ల రద్దు

By:  Tupaki Desk   |   25 Nov 2016 1:54 AM GMT
రియాల్టీకి భారీ దెబ్బేయ‌నున్న పెద్ద నోట్ల రద్దు
X
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500 - రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయం వల్ల రియ‌ల్ ఎస్టేట్ రంగంపై భారీ ప్రభావం పడనుందని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఏకంగా సుమారు 8ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల న‌ష్టం త‌మ ప‌రిశ్ర‌మ‌కు జ‌రిగింద‌ని రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే వినియోగ‌దారుల‌కు మాత్రం మేలుచేస్తుంద‌ని చెప్తున్నారు. సుమారు 30 % మేర ధ‌ర‌లు దిగివ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం నల్లధన నియంత్రణకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల ప్రభావం స్థిరాస్తి మార్కెట్‌ పై కాస్తంత ఎక్కువే ఉంటుంద‌ని అంటున్నారు. ప‌రిశ్ర‌మ ప‌రంగా చూస్తే కొనుగోళ్లు తీవ్రంగా ప్ర‌భావితం అవుతాయ‌ని రియాల్టీ వ‌ర్గాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. మార్కెట్ ధ‌ర‌కు - అధికారిక లావాదేవీల‌కు మ‌ధ్య భారీ తేడా ఉండే రియల్ రంగంలో ఎక్కువ‌గా న‌ల్ల‌ధ‌నం ఆధారితా లావాదేవీలు సాగుతాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మ‌ని ఆ వ‌ర్గాల వాద‌న‌. కేంద్రం తాజా నిర్ణ‌యంతో న‌ల్ల‌ధనానికి ప‌గ్గాలేయ‌డం వ‌ల్ల మార్కెట్‌ లో ముందున్న డిమాండ్ ఉండ‌ద‌ని ప్ర‌స్తుతం ఉండ‌ద‌ని చెప్తున్నారు.

అయితే ఈ ప‌రిణామం వినియోగ‌దారుని కోణంలో మేలు చేసేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుత ధ‌ర‌ల‌తో పోల్చి చూస్తే దాదాపుగా 30% మేర ధ‌ర‌లు రాబోయే కాలంలో త‌గ్గుతాయ‌ని విశ్లేషిస్తున్నారు. ప్లాట్లు - ఫ్లాట్ల‌లో ప‌డిపోయే ఈ విలువ అంతిమంగా కొనుగోలుదారునికి మేలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందే అయినా దీర్ఘకాలంలో స్థిరాస్తి రంగానికి మేలు చేస్తుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. డిమాండ్‌-స‌ప్లై కోణంలో బ్యాంకు రుణాలు రాబోయే కాలంలో ప్ర‌స్తుతంతో పోలిస్తే త‌క్కువ వ‌డ్డీకే అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెప్తున్నారు. త‌ద్వారా సొంత ఇంటి ప్ర‌ణాళిక‌లు ర‌చించే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ క్ర‌మంలో లాభం త‌క్కువగా ఉన్న‌ప్ప‌టికీ రియ‌ల్ రంగానికి గిరాకీ పెరుగుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. న‌గ‌దు చెలామ‌ణి త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ డిజిట‌ల్ లావాదేవీలు పెరుగుతాయని రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మ‌రోవైపు ఈ ప‌రిణామం రియ‌ల్‌ ప‌రిశ్రమ దూకుడును తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని వివ‌రిస్తున్నారు. సుమారు 8ల‌క్ష‌ల కోట్ల మేర ఆదాయం న‌ష్ట‌పోయామ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఇపుడిపుడే ప‌రిశ్ర‌మ గాడిన ప‌డుతుండ‌గా ఈ ప‌రిణామం ఊహించ‌నిద‌ని వాపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/