Begin typing your search above and press return to search.

రేపే మునుగోడు రిజ‌ల్ట్‌.. 1000 ఓల్టుల టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   5 Nov 2022 11:31 AM GMT
రేపే మునుగోడు రిజ‌ల్ట్‌.. 1000 ఓల్టుల టెన్ష‌న్‌
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 1000 ఓల్టుల క‌రెంట్ పాస్ అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా అన్ని ప‌క్షాల రాజ‌కీయ నేత‌లు తీవ్ర‌మైన టెన్ష‌న్‌కు గుర‌వుతున్నారు. ఎవరిని క‌దిపినా ఒక‌టే విష‌యం.. ఏ ఇద్ద‌రు చ‌ర్చించుకున్నా ఒక‌టే విష‌యం.. అదే మునుగోడు ఉప ఎన్నిక రిజ‌ల్ట్‌. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? అస‌లు ఈ రిజల్ట్ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? ఇదీఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుదిపేస్తున్న విష‌యాలు.

భారీ అంచ‌నాలు, అంత‌కుమించి అత్యంత ఖరీదైందిగా చెబుతున్న మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక తీర్పు రేపు వెలువడనుంది. ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొమ్మిది గంటలకు తొలి ఫలితం వెలువడుతుంది.

మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఫలితాలు ప్రకటిస్తారు. ఒక్కో రౌండ్లో 21 కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

సాధ్య‌మైనంత వేగంగా మునుగోడు ఎన్నిక ఫ‌లితాన్ని వెల్ల‌డించేందుకు ఎన్నిక‌ల సంఘం సైతం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మ‌రోవైపు కేంద్ర బ‌ల‌గాలు కూడా మునుగోడుకు చేరుకున్నాయి. ఇదిలావుంటే, ఎన్నిక‌ల ఫ‌లితంపై ఉద‌యం 11-12 మ‌ధ్య ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే, ఇది ఎవ‌రికి అనుకూలం, ఎవ‌రికి వ్య‌తిరేకం అనేదే ఇప్పుడు చ‌ర్చ‌. ఇటు బీజేపీ... అటు టీఆర్ ఎస్‌లు ఎవ‌రికి వారే అంచ‌నాలు వేసుకున్నారు. మేమంటే మేమే గెలుస్తామ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఇక‌, ఈ ఉప ఎన్నిక‌లో బెట్టింగు రాయ‌ళ్లు భారీ ఎత్తున పందేలుకాశారు. సుమారు 100 నుంచి 150 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఇక్క‌డ బెట్టింగులు జ‌రిగిన‌ట్టు పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. దీంతో బెట్టింగు రాయుళ్లు సైతం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక‌, బీజేపీ జాతీయ స్థాయి నాయ‌క‌త్వం ఎప్ప‌టిక‌ప్పుడు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై ప్ర‌త్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం. టీఆర్ ఎస్ వ‌ర్గాలు కూడా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేసి రిజ‌ల్ట్‌పై త‌మ‌దైన దృష్టి సారించారు. మొత్తంగా చూస్తే మునుగోడు ఫీవ‌ర్ త‌గ్గ‌డానికి మ‌రో 24 గంట‌లు ఉండ‌డం.. నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో టెన్ష‌న్ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.