Begin typing your search above and press return to search.

సర్కారుకు మరోసారి ‘హైకోర్టు’ తలంటు తప్పలేదుగా?

By:  Tupaki Desk   |   10 Nov 2019 2:44 PM IST
సర్కారుకు మరోసారి ‘హైకోర్టు’ తలంటు తప్పలేదుగా?
X
ఒకసారి జరిగితే పొరపాటు. కానీ.. అలాంటి పారపాట్లు అదే పనిగా జరగటాన్ని ఏమనాలి? ఎలా తీసుకోవాలి? అన్నదే తెలంగాణ ప్రజల ముందు ఉన్న అంశంగా చెప్పాలి. ప్రభుత్వ విధానాల మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం.. తమ వరకూ వచ్చిన అంశాల మీద ప్రభుత్వాన్ని వివరణ అడిగినప్పుడు అందించే అంశాలు.. వివరాలపై న్యాయస్థానం పెదవి విరుస్తోంది. పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల తీరును తప్పు పడుతూ.. సర్కారుకు తలంటుతోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై జరుపుతున్న విచారణలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన హైకోర్టు.. తాజాగా డెంగీ అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణలోనూ కేసీఆర్ సర్కారు పనితీరును తప్పు పట్టింది.

డెంగీ నివారణకు తీసుకున్న చర్యలకు సంబంధించి కోర్టుకు సమర్పించిన నివేదికలోని వివరాలు అరకొరగా ఉండటం.. సరైన సమాచారాన్ని ఇవ్వకపోవటంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దోమల నివారణకు యంత్రాలు కొనాలంటూ తాము ఆదేశాలు ఇచ్చి రెండు వారాలు అవుతున్నా.. వాటిని కొనుగోలు చేయకపోవటాన్ని తప్పు పట్టింది.

మరో రెండు వారాల్లో సీజన్ ముగియనుందని.. ప్రభుత్వ చర్యలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నట్లుగా పేర్కొంటూ.. ఈ ఇష్యూలో ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికను అందించాలని ఆదేశించారు. శుభ్రతను పెంచటానికి ప్రయత్నిస్తున్నామని.. వ్యర్థాల నియంత్రణ.. నిర్వహణతో పరిశుభ్రత పెంచుతూ దోమలు పెరగకుండా చూస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే.. ఈ నివేదికపై హైకోర్టు ధర్మాసనం పెదవి విరిచింది. ఒక అంశంలో కాకుంటే ఒక అంశంలోనైనా ప్రభుత్వ పనితీరును హైకోర్టు ప్రశ్నించేలా ఉండటం దేనికి నిదర్శనం కేసీఆర్ జీ?