Begin typing your search above and press return to search.

నారాయ‌ణ కుమార్తెలు.. అల్లుడి విష‌యంలో తొంద‌ర‌పాటు చర్య‌లొద్దు: హైకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   16 May 2022 6:08 AM GMT
నారాయ‌ణ కుమార్తెలు.. అల్లుడి విష‌యంలో తొంద‌ర‌పాటు చర్య‌లొద్దు: హైకోర్టు ఆదేశం
X
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్‌తో పాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని.. హౌస్‌మోషన్‌ విధానంలో అత్యవసరంగా విచారించాలని అభ్యర్థిస్తూ వారు వ్యాజ్యాలు దాఖలు చేయగా.. వాటిపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు అత్యవసరంగా విచారణ జరిపారు.

హైద‌రాబాద్‌లో అరెస్టు..

పిటిషనర్లపై బుధవారం(18వ తేదీ) వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి స్థాయి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈ నెల 10న పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.

నిబంధ‌న‌లు పాటించ‌లేదు!

అయితే పోలీసులు అరెస్టు విషయంలో సీఆర్పీసీ 41ఏ నిబంధనలు పాటించలేదని న్యాయాధికారి అభ్యంతరం తెలిపారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నారాయణకు వర్తించవన్నారు. 2014లోనే ఆ విద్యాసంస్థల చైర్మన్‌ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ ఆధారాలు చూపించడంతో అదే రోజు చిత్తూరు 4వ అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదే కేసులో పోలీసులు తమను అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌, విద్యాసంస్థలకు చెందిన జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్‌, జి.సురేశ్‌కుమార్‌, ఎ.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

వాడి వేడి వాద‌న‌లు..

వారి తరపున న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎస్‌.ప్రణతి, జి.బసవేశ్వరరావు పిటిషన్లు వేయగా.. సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు మాల్‌ ప్రాక్టీస్‌ వ్యవహారంతో సంబంధం లేదని.. పోలీసులు నమోదు చేసిన కేసులో వారిని నిందితులుగా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నారాయణ విద్యాసంస్థల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున పోలీసులు వారిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఇదే కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు.

పోలీసుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. పిటిషనర్లను నిందితులుగా పేర్కొననప్పుడు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తే నష్టం ఏముందని ప్రశ్నించారు. ఈ నెల 18వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. దీంతో నారాయ‌ణ కుటుంబానికి హైకోర్టులో ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టు అయింది.