Begin typing your search above and press return to search.

మైనర్ అవాంఛనీయ గర్భాన్ని తొలగించుకునేందుకు టీ హైకోర్టు అనుమతి

By:  Tupaki Desk   |   1 April 2022 4:46 AM GMT
మైనర్ అవాంఛనీయ గర్భాన్ని తొలగించుకునేందుకు టీ హైకోర్టు అనుమతి
X
ఆ బాలికకు పదిహేనేళ్లు మాత్రమే. కానీ.. అనూహ్యంగా గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక గర్భాన్ని తీసేయాలంటూ ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిని సంప్రదించారు. వారు నో చెప్పి.. చట్టపరమైన అనుమతులు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాన్ని ఇచ్చింది. అవాంఛనీయమైన గర్భాన్నితొలగించుకునేలా అనుమతిని మంజూరు చేసింది.

ఇష్టపూర్వకంగానే లైంగికంగా కలిసినప్పటికి అత్యాచారం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేస్తూ.. గర్భం కారణంగా మైనర్ బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని.. శారీరకంగా.. మానసికంగా ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఇంతకీ పదిహేనేళ్ల బాలిక గర్భం దాల్చటం ఏమిటి? అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

పదిహేనేళ్ల వయసున్న మైనర్ బాలిక జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందినది. ఎనిమిదో తరగతి చదివిన ఆమె.. తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లలున్న 26 ఏళ్ల వ్యక్తి.. వ్యక్తిగత పనుల నిమిత్తం వీరిందిటికి వచ్చాడు. బాలిక తల్లిని అక్క అని పిలిచేవాడు. కొద్దిరోజులు వారితోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బాలిక తల్లిదండ్రులు రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడేవాడు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే ఆమెను చంపేస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవటం మొదలైంది. దీంతో.. తాను పడుతున్న ఇబ్బందిని తల్లిదండ్రులకు చెప్పేసింది. దీంతో.. వారు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న అతడ్ని పట్టుకున్నారు.

అనంతరం కోర్టు ముందు హాజరుపర్చగా.. అతడ్ని రిమాండ్ కు తరలించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. బాలిక గర్భం దాల్చినట్లుగా తేలింది. దీంతో.. సదరు బాలిక అవాంఛనీయ గర్భాన్ని తొలగించాలని కోరుతూ నీలోఫర్ వైద్యుల్ని సంప్రదించారు. వారు తాము ఏమీ చేయలేమని.. చట్టబద్ధమైన అనుమతులు తీసుకొస్తేనే అవాంఛనీయ గర్భాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు.

దీంతో.. బాలిక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. మైనర్ బాలిక ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిసినా అది అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేస్తూ.. అవాంఛనీయమైన గర్భాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. అయితే.. దీనికి ముందు బాలికతో మాట్లాడాలని చెప్పింది. 20 వారాల (ఐదు నెలలు) గర్భంతో కోర్టుకు రావటం ఇబ్బందికరమని.. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తమ అభిప్రాయం చెప్పాలని పేర్కొంది. అబార్షన్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను వివరించాలని.. తల్లి.. బాలిక ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భ విచ్ఛిత్తి చేయాలని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులను హైకోర్టు ఆదేశించింది.