Begin typing your search above and press return to search.

రియాలిటీలోకి రానున్న భరత్ అనే నేను సీన్!

By:  Tupaki Desk   |   22 Aug 2019 6:41 AM GMT
రియాలిటీలోకి రానున్న భరత్ అనే నేను సీన్!
X
ఆ మధ్యన విడుదలై భారీ సక్సెస్ సొంతం చేసుకున్న భరత్ అనే నేను సినిమాలో సీన్ ఒకటి రియల్ కానుంది. ముఖ్యమంత్రి పాత్రను పోషించిన మహేశ్.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. చిన్న తప్పులకు వేలాది రూపాయిల భారీ జరిమానాలు విధించటం.. ప్రజలు షాక్ కు గురి కావటం తెలిసిందే. సరిగ్గా.. ఇదే తీరులో ట్రాఫిక్ ఉల్లంఘనులను దారికి తెచ్చేందుకు భారీ జరిమానాల్ని తెర మీదకు తీసుకొచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ చిన్న చిన్న తప్పులుగా పరిగణించే నేరాలకు కొత్త చట్టం ప్రకారం భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఒకటి నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నయా జరిమానాలపై హైదరాబాద్ నగర పోలీసులు సైతం ఇప్పుడు సరికొత్త అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

జరిమానాలన్న విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా.. మీరు ఈ తప్పులు చేయకుండా ఉంటే.. ఇంత డబ్బును ఆదా చేసినట్లే అంటూ భారీ ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్న వైనం ఇప్పుడు అందరిని అకర్షిస్తోంది. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే వెయ్యి.. సీటు బెల్ట్ పెట్టుకోకుంటే వెయ్యి.. సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తే రూ.5వేలు.. రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే రూ.5వేలు.. డ్రంకెన్ డ్రైవ్ చేస్తే రూ.10వేలు జరిమానాలు విధించనున్నారు.

వీటికే కాదు.. సిగ్నల్ జంప్ నకు రూ.5వేలు.. ట్రిపుల్ డ్రైవింగ్ కు సైతం భారీ జరిమానాను విధించనున్నారు. ఇక.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేలు.. అనర్హత వేటు వేసిన తర్వాత కూడా వాహనాన్ని నడిపితే ఏకంగా రూ.10వేలు ఫైన్ విధిస్తారు. బండికి ఇన్స్యూరెన్స్ లేకున్నా కూడా భారీ వాత ఖాయం. గతంలో ఇన్య్సూరెన్స్ లేకుంటే వెయ్యి రూపాయిలు జరిమానా విధించే వారు. ఇప్పుడు అది కాస్తా రూ.2వేలుగా మారింది. కేంద్రం చేసిన కొత్త చట్టం ప్రకారం ఈ భారీ ఎత్తున జరిమానాలు సెప్టెంబరు ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. అయితే.. కేంద్రం ఈ కొత్త ఫైన్ల గురించి ముందే సమాచారం వెల్లడించిన నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు ఇందుకు లోబడి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. ఏది ఏమైనా సెప్టెంబరు ఒకటి తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి భారీ మోత ఖాయమని చెప్పక తప్పదు. సో.. బండి తీసుకొని బయటకు వెళుతున్నారా? కాస్తంత ఒళ్లు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.