Begin typing your search above and press return to search.

భారీ పెనాల్టీలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయా?

By:  Tupaki Desk   |   1 Sep 2019 4:33 AM GMT
భారీ పెనాల్టీలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయా?
X
తప్పు చేస్తే జరిమానా విధించటం తప్పేం కాదు కానీ.. దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయేలా వాహనదారుల నడ్డి విరిచేలా కొత్త ఫైన్లు విధించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరగటం.. వాహనదారుల్లో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పెనాల్టీలు ఇప్పటివరకూ ఉన్న దానికి పది రెట్లు ఎక్కువగా ఉండటంపై పలువురు తప్పు పడుతున్నారు.

మరి.. ఈ రోజు నుంచి కొత్త పెనాల్టీలు అమల్లోకి వచ్చేశాయా? వాహనదారులు చేసే తప్పులకు దిమ్మ తిరిగిపోయేలా భరత్ అనే నేను ఫైన్లు వేయనున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. శనివారం రాత్రి వరకూ రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి జీవోలు జారీ చేయలేదు. కేంద్రం తెర మీదకు తీసుకొచ్చిన కొత్త జరిమానాల్ని అమలు చేసే విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపడకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్త జరిమానాల విషయంలో తీసుకునే నిర్ణయం ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో.. ఈ రోజు నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పెనాల్టీల్ని వాయిదా వేసినట్లుగా సమాచారం.

శనివారం సాయంత్రం తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధికారులతో భేటీ అయి.. కొత్త పెనాల్టీల సర్య్కులర్ ను అధికారులకు అందచేశారు. ఈ భారీ పెనాల్టీల్ని అమల్లోకి తీసుకొస్తే ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు అధికారులు వ్యక్తం చేయటంతో.. ఆంధ్రప్రదేశ్.. .. కర్ణాటక.. కేరళలలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుందా? అన్న విషయాలపై స్పష్టత తెచ్చుకునేందుకు వీలుగా ఫోన్లు చేసినట్లుగా సమాచారం.

అయితే.. ఆయా రాష్ట్రాలు కేంద్రం తీసుకొచ్చిన సరికొత్త జరిమానాల్లో మార్పులు చేర్పులు చేయాలని కోరుతూ సవరణ ప్రతిపాదనల్ని పంపినట్లుగా తేలింది. ఈ క్రమంలో కొత్త జరిమానాల్ని అమల్లోకి తీసుకురాకుండా.. ప్రతిపాదనల్ని సిద్ధం చేసి మిగిలిన రాష్ట్రాల మాదిరి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా కొత్త జరిమానాలు ప్రతిపాదన దశలోనే సవరణలు చేయాలన్న ఆయా రాష్ట్రాల సూచనపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.