Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అత్య‌ధిక, అత్య‌ల్ప ఓట్లు సాధించిన‌వారు వీరే!

By:  Tupaki Desk   |   21 July 2022 8:30 AM GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అత్య‌ధిక, అత్య‌ల్ప ఓట్లు సాధించిన‌వారు వీరే!
X
జూలై 18న భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జూలై 21న ఉద‌యం 11 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపును చేప‌ట్టారు. సాయంత్రం 4 గంట‌ల‌కల్లా ఫ‌లితాలు వెలువ‌డ‌తాయ‌ని అధికారులు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము, ప్ర‌తిప‌క్షాల కూట‌మి త‌ర‌ఫున కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

అయితే దాదాపు 60 శాతానికి పైగా ఓట్ల‌ను ద్రౌప‌ది ముర్ము సాధిస్తార‌ని, ఆమె రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌వ‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ద్రౌప‌ది ముర్ము విజ‌యం సాధిస్తే తొలి గిరిజ‌న రాష్ట్ర‌ప‌తిగా రికార్డు సృష్టిస్తారు.

కాగా భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చాక ఇప్ప‌టివ‌ర‌కు 14 మంది రాష్ట్ర‌ప‌తులుగా ప‌నిచేశారు. ఇప్పుడు 15వ రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎన్నిక జ‌రిగింది. కాగా ముర్ముకు ముందు రాష్ట్ర‌ప‌తులుగా ప‌నిచేసిన 14 మందిలో స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ అత్య‌ధిక ఓట్లు సాధించార‌ని గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. ఆయ‌న 98.2 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఇక అత్య‌ల్సంగా వివి గిరి 50.9 శాతం ఓట్లు మాత్ర‌మే సాధించారు.

మొద‌టి రాష్ట్ర‌ప‌తి బాబూ రాజేంద్ర ప్ర‌సాద్ ఏక‌గ్రీవంగా ఎంపిక‌య్యారు. రెండో రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ 98.2 శాతం ఓట్లు, మూడో రాష్ట్ర‌ప‌తి జాకీర్ హుస్సేన్ 56.2 శాతం, నాలుగో రాష్ట్ర‌ప‌తి వివి గిరి 50.9 శాతం ఓట్లు, ఐదో రాష్ట్ర‌ప‌తి ఫ‌కృద్దీన్ అలీ అహ్మ‌ద్ 78.9 శాతం ఓట్లు సాధించారు. ఆరో రాష్ట్ర‌ప‌తి నీలం సంజీవ‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎంపిక‌య్యారు. ఇక ఏడో రాష్ట్ర‌ప‌తి జ్ఞానీ జైల్ సింగ్ 72.7 శాతం, ఎనిమిదో రాష్ట్ర‌ప‌తి ఆర్.వెంక‌ట్రామ‌న్ 72.3 శాతం, తొమ్మిదో రాష్ట్ర‌ప‌తి శంక‌ర్ ద‌యాళ్ శ‌ర్మ 65.9 శాతం, ప‌దో రాష్ట్ర‌ప‌తి కెఆర్ నారాయ‌ణ‌న్ 95 శాతం, ప‌ద‌కొండో రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం 89.6 శాతం, ప‌న్నెండో రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిభా పాటిల్ 65.8 శాతం, 13వ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ 69.3 శాతం, 14వ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ 65.7 శాతం ఓట్లు సాధించారు.

వీరంద‌రిలో మొత్తం మీద స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్, కేఆర్ నారాయ‌ణ‌న్, ఏపీజే అబ్దుల్ క‌లాం అత్య‌ధిక ఓట్లు సాధించారు. అతి త‌క్కువ‌గా వివి గిరి, జాకీర్ హుస్సేన్ ల‌కు 60 శాతం కంటే లోపు ఓట్లు మాత్ర‌మే ద‌క్కాయి.