Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో చేయనివి మరో ఐదేళ్లలో చేయటమా అమిత్ షా?

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:23 AM GMT
ఐదేళ్లలో చేయనివి మరో ఐదేళ్లలో చేయటమా అమిత్ షా?
X
అధికారంలో ఉన్న వారు ఏం చేయటానికైనా అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న ఆ వెసులుబాటు వేరుగా ఉంటుంది. ఐదేళ్లు పాలించేందుకు అవకాశం లభించినప్పుడు.. ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా సంక్షేమ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపట్టే వీలు ఉంటుంది. ఎన్నికలకు ముందు ఒకట్రెండు సంవత్సరాల నుంచి కొత్త పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. తాము అమలు చేస్తున్న పథకాల్ని పూర్తి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని అడగటం ఈ మధ్యన కొత్తగా కనిపిస్తోంది.

అందుకు భిన్నంగా ఐదేళ్లు చేతిలో అధికారంలో ఉన్నప్పుడు చేయని పలు పనుల్ని.. మరో ఐదేళ్ల పాటు తమ చేతికి పవర్ ఇస్తే చేస్తామని చెప్పటానికి మించిన ఎటకారం మరింకేమీ ఉండదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మహారాష్ట్ర ఎన్నికల వేళ బీజేపీ చెబుతోంది. ఇప్పుడా రాష్ట్రంలో పవర్లో ఉన్నది ఆ పార్టీనే. మరి.. ఐదేళ్ల కాలంలో ఉద్యోగా కల్పన విషయంలో.. మరే ఇతర అంశాల మీదా ఫోకస్ చేయని బీజేపీ ఇప్పుడు మాత్రం.. తమ చేతికి మరోసారి అధికారం ఇస్తే అద్భుతాలే చేస్తామని ఊరిస్తున్నారు.

కేంద్రంలోని మోడీ సర్కారు సైతం ఉద్యోగాల కల్పన విషయంలో ఫెయిల్ అయ్యిందన్న మాట వినిపిస్తూనే ఉంది. కేంద్రం స్థాయిలోనే ఇలా ఉంటే.. అదే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితిని ఊహించుకోలేం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా తమ పార్టీ మేనిఫేస్టోను విడుదల చేసింది బీజేపీ. ఇందులో తమ ప్రభుత్వం మళ్లీ కొలువు తీరితే.. కోటి వరకూ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పటం సంచలనంగా మారింది. మాంద్యం కారణంగా కేంద్రమే ఉద్యోగాలు ఇవ్వటం కష్టంగా మారిన వేళ.. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ ఏకంగా కోటి ఉద్యోగాల మాట ఎన్నికల వేళలో ఇచ్చేయటం సంచలనంగా మారింది.

గ్రామీణ ప్రాంతాల్లో 30 వేల కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మాణం చేస్తామన్న హామీని ఇచ్చారు. అందరికి ఇళ్లు నిర్మించి ఇస్తామని.. మధ్య.. దిగువ మధ్యతరగతి వారిని ఆకట్టుకునే పథకాల్లో భాగంగా.. పలు అంశాల్ని ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్నారు. ఎన్నికల హామీ పత్రాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు విడుదల చేశారు. ఏమైనా.. ఐదేళ్లలో చేయగలిగిన అంశాల్ని వదిలేసి.. ఇప్పుడు మళ్లీ చేతికి పవర్ వస్తే చేస్తామనటం సరికాదన్న మాట వినిపిస్తోంది.