Begin typing your search above and press return to search.

ప్రధానిగా మోదీ ప్రమాణం...హైలైట్స్ ఇవే

By:  Tupaki Desk   |   30 May 2019 3:57 PM GMT
ప్రధానిగా మోదీ ప్రమాణం...హైలైట్స్ ఇవే
X
భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి ప్రమాణం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీ సాధించిన నేపథ్యంలో మోదీ వరుసగా రెండో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్ లో సరిగ్గా నేటి రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకారోత్సవంలో తొలుత మోదీతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు - పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ ఎదుట సువిశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 8 వేల మంది విశిష్ఠ అతిథులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్ ఏమిటంటే...

-ముందుగా నిర్దేశించుకున్న సమయానికే 6.58 గంటలకు మోదీ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.

-ఆ తర్వాత సరిగ్గా 7 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కార్యక్రమానికి వచ్చారు.

-7.04 గంటలకు వరుసగా రెండో సారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేశారు.

-కార్యక్రమానికి అందరి కంటే ముందుగానే బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హాజరయ్యారు. వచ్చిన ప్రతి నేత అద్వానీకి నమస్కారం చేసిన తర్వాతే తమ సీట్లలో కూర్చున్నారు.

-మోదీ వచ్చిన తర్వాత గానీ కనిపించని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీసమేతంగా వచ్చారు. నేరుగా అద్వానీ వద్దకు వెళ్లిన వెంకయ్య ఆయనకు నమస్కారం పెట్టగా... వెంకయ్య సతీమణి అద్వానీ పాదాలకు నమస్కారం చేశారు.

-ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అదిత్య నాథ్ యోగీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పలుమార్లు తన సీట్లో నుంచి లేచి కలియదిరిగిన యోగీ... అందరికీ నమస్కారం పెడుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

-ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ - రాహుల్ గాంధీ - మన్మోహన్ సింగ్ - మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.

-కేబినెట్ బెర్తులు దక్కించుకున్న వారంతా ఆహ్వానితులతో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వరుసగా కూర్చున్నారు. ఫస్ట్ వరుసలో ఫస్ట్ సీట్లో మోదీ కూర్చుంటే... ఆయన పక్కన రాజ్ నాథ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితరులు కూర్చున్నారు.

-ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బిమ్స్ టెక్ దేశాధినేతల హోదాలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి - మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియంట్ - భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ లు హాజరయ్యారు. అలాగే ధాయ్ ల్యాండ్ ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్ రాక్ - కిర్గిజ్ అధ్యక్షుడు సూరోన్ బే జీన్ బెకోవ్ - మారిషస్ ప్రధాని కుమార్ జుగ్నాథ్ తదితరులు కూడా హాజరయ్యారు.