Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ్యానిఫెస్టోలో ఇవ‌న్నీ ఉంటాయ‌ట‌

By:  Tupaki Desk   |   6 Nov 2018 10:45 AM GMT
కేసీఆర్ మ్యానిఫెస్టోలో ఇవ‌న్నీ ఉంటాయ‌ట‌
X
పలు కీలకమైన హామీలతో పాటు - భారీ సంఖ్యలో కొత్త ప్రతిపాదనలు తుది మ్యానిఫెస్టోలో ఉండేలా తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ ఎన్నికల కమిటీ చేస్తున్న కసరత్తు కొలిక్కి వ‌చ్చింది. ఉప‌ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన దళిత - గిరిజనుల కోసం హామీల రూపకల్పనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయ‌గా ఈ కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు అధ్యక్షతన మ్యానిఫెస్టో కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ కమిటీలు నవంబరు 3 కల్లా తమ నివేదికలను సిద్ధం చేసి సీఎం కేసీఆర్‌ కు సమర్పించాయి. తాజాగా రాష్ట్రంలోని రైతాంగానికి పంట సమయంలో ఎంతగానో ఉపయోగపడుతున్న రైతుబంధు - జీవితాంతం ఉపయోగపడే ‘రైతుబీమా’ తరహాలోనే కొత్త ప్రభుత్వంలో మహిళలకూ బీమా సౌకర్యాన్ని కల్పించడంపై టిఆర్‌ ఎస్ దృష్టి సారించింది. త్వరలో విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఇలాంటి పలు కొత్త హామీలు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళలకు రూ. 4 లక్షల బీమా - దళితులకు రూ. 5 లక్షల బీమా చొప్పున ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా మేనిఫెస్టోలో టిఆర్‌ ఎస్ హామీ ఇవ్వనున్నట్లు తెలిసింది.

30 ల‌క్ష‌ల‌మందిని దృష్టిలో ఉంచుకొని ఈ మ్యానిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది. గరిష్ట వయో పరిమితి ప్రాతిపదికన మహిళల కోసం ప్రత్యేకంగా ఈ బీమా సౌకర్యాన్ని అమలుచేసేలా హామీ ఇస్తుందని - దీని ద్వారా సుమారు 30 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని పార్టీ అంచనా వేసింది. ఈ పథకం అమలు కోసం ఏటా సుమారు రూ. 400 కోట్లు ఖర్చు కానుందని - తొలుత దీన్ని అమలు చేసిన తర్వాత తక్కువ వయసు కలిగిన మహిళల నుంచి కూడా డిమాండ్ వచ్చినట్లయితే వారికి కూడా వర్తించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామన్న హామీని కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మ‌రోవైపు మహిళల కోసం ప్రత్యేకంగా బీమా సౌకర్యాన్ని కల్పించేలా మేనిఫెస్టోలో ఇచ్చే హామీ తరహాలోనే రాష్ట్రంలోని దళితులందరికీ ఇలాంటి బీమా సౌకర్యాన్ని అమలుచేస్తామన్న హామీని కూడా మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకు బీమా మొత్తాన్ని నాలుగు లక్షల రూపాయలకు పరిమితం చేసినా దళితులకు మాత్రం ఐదు లక్షల రూపాయల వరకు అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే రైతు బీమా ద్వారా రాష్ట్రంలో సుమారు 28 లక్షల మందికి అర్హత ఉన్నందున ఈ పరిధిలోకి రాని మహిళలు - దళితుల కోసం విడివిడి బీమా పథకాలను అమలుచేసేలా టిఆర్‌ ఎస్ ఆలోచిస్తోంది. దళితులకు కల్పించే బీమా సౌకర్యానికి కూడా అర్హత వయసును నిర్దిష్టంగా పేర్కొనే అవకాశం ఉంది. రైతు బీమా పరిధిలోకి రాని దళితులకు ఈ పథకం వర్తించేలా టిఆర్‌ ఎస్ ఆలోచిస్తోంది. ఆ విధంగా కనీసంగా ఐదు లక్షల మంది దళితులకు ఈ కొత్త బీమా పథకం ద్వారా ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావన. టిఆర్‌ ఎస్ మేనిఫెస్టో కమిటీ ఈ రెండు బీమా పథకాలపై గణాంకాలతో సహా విశ్లేషించిన దాని ద్వారా సమాజంలో సుమారు 40 లక్షల మందికి కలిగే ప్రయోజనాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించనుంది. దీపావ‌ళి త‌ర్వాత మ్యానిఫెస్టో ప్ర‌క‌ట‌న ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.