Begin typing your search above and press return to search.

కర్ణాటకలో మళ్లీ రాజుకున్న హిజాబ్ వివాదం

By:  Tupaki Desk   |   29 May 2022 6:32 AM GMT
కర్ణాటకలో మళ్లీ రాజుకున్న హిజాబ్ వివాదం
X
కర్ణాటకలో మళ్లీ హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. కొందరు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరువుతున్నారని మంగళూరు యూనివర్సిటీ కాలేజీకి చెందిన విద్యార్థుల బృందం నిరసనతో ఈ వివాదం రాజుకుంది. హిందూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. తాము కూడా కాషాయ వస్త్రాలు, కాషాయ సఫా ధరించి క్లాస్ కు హాజరవుతామని ప్రకటించారు. ఈ తాజా వివాదంపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.

కోర్టు ఇప్పటికే హిజాబ్ తరగతి గదుల్లో ధరించవద్దని తీర్పును ఇచ్చిందని.. ప్రతి ఒక్కరూ దీనిని అనుసరించాలని తెలిపింది. 99.99శాతం మంది విద్యార్థులు కోర్టు తీర్పును పాటిస్తున్నారని.. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటించాల్సిందే అని సీఎం బసవరాజ్ బొమ్మై మీడియాతో తెలిపారు.

-వివాదం ఎలా మొదలైంది?

దాదాపు 44 మంది విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తున్నారని.. వారిలో కొందరు తరగతి గదుల్లో కూడా అలాగే చేస్తున్నారని విద్యార్థులు క్యాంపస్ లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. కళాశాల క్యాంపస్ లో మే 16వ తేదీన ఒక సర్క్యూలర్ కూడా జారీ చేశారు. క్యాంపస్ లోపల హిజాబ్ లేదా బురఖా ధరించకుండా నిషేధం విధించారు. కానీ ఆ సర్క్యూలర్ విడుదలైన కొన్ని రోజులకే విద్యార్థులు పాటించకుండా హిజాబ్ ధరించి రావడంతో ఈ వివాదం మళ్లీ మొదలైంది. హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో కళాశాల విఫలమైందని ఆరోపించారు.

-హిజాబ్ అంటే ఏమిటీ?

హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని ‘హిజాబ్ ’ అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.

1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.

హిజాబ్ వివాదం కోర్టు ఎక్కింది. దీనిపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్ పై ఎవరినీ బలవంతం చేయవద్దన్న న్యాయస్థానం.. విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టకూడదని తీర్పు వచ్చేవరకూ క్లాస్ రూంలలో విద్యార్థులు హిజాబ్ లు, కాషాయ కండువాలు ధరించవద్దని సూచించింది.