Begin typing your search above and press return to search.

ఆఖరి ప్రైమరీలోనూ అదరగొట్టేసింది

By:  Tupaki Desk   |   16 Jun 2016 4:50 AM GMT
ఆఖరి ప్రైమరీలోనూ అదరగొట్టేసింది
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికే తేలిపోయినా.. ప్రైమరీలు పూర్తి కాని పరిస్థితి. చివరి ప్రైమరీ వరకూ తాను బరిలోనే ఉన్నట్లుగా హిల్లరీ ప్రత్యర్థి శాండర్స్ మాటల నేపథ్యంలో ఆఖరి ప్రైమరీ ఎన్నికను అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా జరిగిన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రైమరీ ఎన్నిక మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

వాషింగ్టన్ డీసీకి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ 78.9 శాతం ఓట్లతో విజయం సాధించగా.. ఆమె ప్రత్యర్థి శాండర్స్ కేవలం 21.1శాతం ఓట్లను మాత్రం సొంతం చేసుకున్నారు. దీంతో.. డెమోక్రాట్ల అభ్యర్థిగా హిల్లరీ ఎంపిక పూర్తి అయినట్లే. ఈ పార్టీకి చెందిన మొత్తం 4,763 మండి డెలిగేట్లకు గాను హిల్లరీకి 2,800 మంది.. శాండర్స్ కు 1832 మంది మద్దతు ప్రకటించారు. హిల్లరీనే డెమోక్రాట్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి అన్న విషయం తేలిపోయినప్పటికీ.. ఈ విషయాన్ని ఆ పార్టీ మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

వచ్చే నెలలో ఫిలడెల్ఫియాలో జరిగే డెమోక్రాట్ల కన్వెన్షన్ లో హిల్లరీ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే.. హిల్లరీ ప్రత్యర్థిగా వ్యవహరించిన శాండర్స్ ఇప్పటివరకూ తన ఓటమిని అంగీకరించకున్నా.. తాజాగా జరిగిన ఆఖరి ప్రైమరీ ఎన్నికల ఫలితం తర్వాత తన ఓటమిని అంగీకరించటంతో పాటు.. హిల్లరీని అభినందించారు. ఆమెకు తన మద్దతు సంపూర్ణంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక.. తమ ప్రత్యర్థి అయిన ట్రంప్ ను ఢీ కొనేందుకు అవసరమైన వ్యూహంతో పాటు.. పలు అంశాల మీద హిల్లరీని కలిసిన శాండర్స్ ఆమెతో చర్చ జరపటం గమనార్హం.