Begin typing your search above and press return to search.

డిప్రెషనుకు దగ్గర్లో హిల్లరీ!!

By:  Tupaki Desk   |   17 Nov 2016 10:16 AM GMT
డిప్రెషనుకు దగ్గర్లో హిల్లరీ!!
X
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో షాకింగ్ ఓట‌మిని ఎదుర్కొన్న హిల్ల‌రీ క్లింట‌న్‌ ను తీవ్ర నైరాశ్యం క‌మ్మేసింది. తాజాగా చిల్డ్ర‌న్స్ డిఫెన్స్ ఫండ్ కోసం ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొన్న హిల్ల‌రీ త‌న‌ను ఆవ‌హించిన వైరాగ్యాన్ని పంచుకున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి నేపథ్యంలో త‌న‌కు ఇళ్లు వ‌ద‌లి వెళ్లాల‌ని అనిపించ‌డం లేద‌ని, ఓ మంచి పుస్త‌కాన్ని చ‌ద‌వాల‌నిపిస్తున్న‌ట్లు హిల్ల‌రీ చెప్పారు. అస‌లు ఈ ఫంక్ష‌న్‌కు రావ‌డానికి చాలా ఇబ్బందిప‌డ్డాన‌ని, అయినా రావ‌డం త‌ప్ప‌లేద‌న్నారు.

సుమారు 20 నిమిషాలు మాట్లాడిన హిల్ల‌రీ క్లింట‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ల్ల చాలా మంది నిరుత్సాహ‌ప‌డి ఉంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరిక‌న్లు క‌లిసి క‌ట్టుగా ముందుకు వెళ్లాల‌ని పిలుపునిచ్చారు. పిల్ల‌ల‌ను ట్రీట్ చేస్తున్న విధానంతోనే ఆ దేశ స‌మాజం తెలిసిపోతుంద‌న్నారు. స్కూల్‌కు వెళ్లేందుకు పిల్ల‌లు ఎవ‌రూ ఇబ్బందులు ప‌డ‌రాద‌ని అలాంటి విద్య‌ను అందించిన‌పుడే ఏ దేశ‌మైనా బాగుప‌డుతుంద‌ని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, కొత్త స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే విధంగా విద్య ఉండాల‌న్నారు.

ఇదిలాఉండ‌గా అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ త‌న చేతిలో ఓట‌మి పాలైన హిల్లరీ క్లింటన్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వివిధ అంశాల విష‌యంలో హిల్ల‌రీపై విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ ను నియమించడం గురించి తాను ఇంకా ఏమీ ఆలోచించలేదని ట్రంప్‌ చెప్పారు. అంతకన్నా ఉద్యోగాలు - ఆరోగ్యం - వలసల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని సీబీఎస్ చానెల్ 60 మినిట్స్ కార్యక్రమంలో చెప్పారు. ముందుగా దేశాన్ని చక్కదిద్దాల్సి ఉందని పేర్కొన్నారు. హిల్లరీపై విచారణ గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించగా.. మరోసారి 60 మినిట్స్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు కచ్చితంగా సమాధనమిస్తా అంటూ దాటవేశారు. హిల్లరీపై దర్యాప్తులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకుగానూ ఎఫ్‌ బీఐ డైరెక్టర్ జోమ్స్ కోమీ రాజీనామాను కోరుతారా? అని అడిగితే, అతనితో మాట్లాడిన తర్వాతే ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలనని ట్రంప్ అన్నారు. తన క్యాబినెట్ గురించి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌పై ఎలాంటి చర్యలు చేపడతారు అని అడిగితే ఐఎస్ అనేది లేకుండా చేస్తా అని ముక్తసరిగా చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/