Begin typing your search above and press return to search.

కాండ్లాలోనూ హిందూ ఫ్యామిలీలు వెళ్లిపోతున్నాయ్

By:  Tupaki Desk   |   15 Jun 2016 6:23 AM GMT
కాండ్లాలోనూ హిందూ ఫ్యామిలీలు వెళ్లిపోతున్నాయ్
X
నిన్న మొన్నటి వరకూ ఎవరికి పట్టని కైరానా పట్టణం ఇప్పుడు జాతీయ మీడియా పతాక శీర్షికల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ ఊరికి చెందిన వందలాది హిందూ కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోవటం.. ఎందుకిలా? అన్న విషయంపై స్పష్టత రాని నేపథ్యంలో.. బీజేపీకి చెందిన బృందం ఒకటి ఆ ఊరికి పయనమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఒక చిన్న ఊరు నుంచి అంత పెద్ద సంఖ్యలో హిందూ కుటుంబాలు ఎందుకు తరలి వెళుతున్నాయన్న అంశంపై స్పష్టత రాకున్నా.. కైరానా లాంటి ఉదంతమే కాండ్లా అనే మరో ఊరిలోనూ చోటు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఊరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. మెజార్టీ ముస్లిం జనాభా ఉన్న కారణంగా.. తమపై దాడులు జరగొచ్చన్న భయంతో హిందూ కుటుంబాలు వలస వెళ్లిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ.. అందులో నిజం ఎంతన్నది ఇప్పటి వరకూ స్పష్టం కాలేదు.

కైరానా విషయంలో క్లారిటీ లేని నేపథ్యంలో.. అలాంటి ఉదంతమే కాండ్లాలో కూడా చోటు చేసుకోవటం ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాండ్లాలో మొత్తం 26 వేల మంది జనాభా ఉండగా.. హిందువుల సంఖ్య మాత్రం 8 వేలు మాత్రమే ఉందట. మెజార్టీలు ముస్లింలే అక్కడ ఉంటున్నారట. ముస్లింలు తమ మీద ఎక్కడ దాడులు చేస్తారన్న భయంతో వారు ఊరు విడిచి వెళ్లిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే.. దేశంలో మెజార్టీలు ఏ వర్గం వారు ఉంటే వారు మాత్రమే ఉండి.. మిగిలిన వారంతా ఊరు విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ.. యూపీలోని ఈ రెండు ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? బయటకు రాని విషయాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఇలా వలసల బాట పడుతున్న రెండు ప్రాంతాల్లోనే ముస్లింలే ఎక్కువగా ఉండటం ఎందుకు? లాంటి ప్రశ్నలకు యూపీ సర్కారు సమాధానం చెబితే బాగుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.