Begin typing your search above and press return to search.

తాజ్ కింద శివాల‌యం...తాజ్ చుట్టూ బాంబులు..

By:  Tupaki Desk   |   24 Oct 2017 11:40 AM GMT
తాజ్ కింద శివాల‌యం...తాజ్ చుట్టూ బాంబులు..
X
తాజ్‌ మహల్‌ పై చర్చ - వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇప్పటికే రకరకాల వ్యాఖ్యలతో తాజ్‌ మహల్ వివాదం రగులుకోగా తాజాగా తాజ్ దేవాల‌యం అనే ఎపిసోడ్ తెరమీద‌కు వ‌చ్చింది. తాజ్‌మహల్‌ ప్రాంగణంలో శివ చాలీసా పఠనం జరిగింది. ఈ ప‌రిణామం క‌ల‌క‌లం రేపిన నేప‌థ్యంలో... వారిని అరెస్టు చేశారు. తాజ్ వ‌ద్ద‌ శివ చాలీసా పఠనానికి సంబంధించి 12 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్రీయ స్వాభిమాన్‌ దళ్‌ - హిందూ యువ వాహని కార్యకర్తలు శివనామ స్మరణ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అయితే తాజ్‌కు భద్రత కల్పించే సీఐఎస్‌ ఎఫ్‌ దళాలు...ఆ రెండు వర్గాల కార్యకర్తలను అరెస్టు చేసి.. ఆ తర్వాత విడుదల చేశారు. ఆర్‌ ఎస్‌ డీకి చెందిన దీపక్‌ శర్మ నేతృత్వంలో ఈ శివ పారాయణం సాగింది. తాజ్‌ మొదట్లో శివాలయమని - సోమవారం రోజున శివున్ని ఆరాధిస్తామని ఆయన అన్నారు. తేజోమాలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని మొఘల్‌ రాజులు నేలకూల్చి.. ఇక్కడే తాజ్‌ ను నిర్మించారన్నారు. తాజ్‌ ను దేశద్రోహులు నిర్మించాలని ఇటీవల యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మ‌రోవైపు తాజాగా బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు దాని పేరును తాజ్‌ మహల్ కాదు తాజ్‌ మందిర్‌ గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ప్రాంతమంతా శివుడిదేనని - పేరు మార్చడంలో ఎలాంటి తప్పు లేదని కతియార్ వాదిస్తున్నారు. తాజ్‌ మహల్ దగ్గర హిందూ యువ వాహినికి చెందిన సభ్యులు శివ చాలీసా చదివిన ఘటనపై స్పందిస్తూ కతియార్ ఈ కామెంట్స్‌ చేశారు. సోమవారం కొందరు యువ వాహిని సభ్యులు తాజ్‌ మహల్ దగ్గర శివచాలీసా చదవగా.. వారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అసలు తాజ్ మహల్ ఒక శివుని ఆలయం అని, దాని పేరు తేజో మహల్ అని గత వారం వినయ్ కతియార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హిందూ రాజులు కట్టించిన ఈ దేవాలయాన్ని కూల్చి షాజహాన్ తాజ్‌ మహల్ నిర్మించాడని కతియార్ ఆరోపించారు. అక్కడి ఆలయం ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, శివలింగం ఉన్న చోట షాజహాన్ సమాధి నిర్మించాడని ఆయన విమర్శించారు.

మ‌రోవైపు సోమవారం రాత్రి తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తాజ్‌ గంజ్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. తాజ్‌ మహల్ వద్ద బాంబు పెట్టామని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తాజ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం అక్కడ బాంబు లేదని.. ఫేక్ కాల్‌ గా పోలీసులు నిర్ధారించారు. తాజ్‌ మహల్ ఆవరణలో సోమవారం.. శివ చాలీసా పారాయణం చేసిన కొద్దిసేపటికే బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.