Begin typing your search above and press return to search.

బీజేపీలో సాధువుల రాజ్యం

By:  Tupaki Desk   |   19 March 2017 6:24 AM GMT
బీజేపీలో సాధువుల రాజ్యం
X
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నిక నేపథ్యంలో బీజేపీలో సాధువులు, సన్యాసులు, యోగుల ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమవుతోంది. హిందూత్వ భావజాలమున్న పార్టీగా పేరున్న బీజేపీకి మత సంస్థలు, మఠాలు, సాధువులతో ఉన్న సత్సంబంధాలు కొత్తేమీ కాకపోయినా ప్రస్తుతం చట్టసభల్లోనూ వారి ప్రాధాన్యం పెరుగుతోంది. కీలక రాష్ర్టాల్లో పాలనాధికారం కూడా వారి చేతుల్లో పెడుతున్నారు. ఇంతకుముందు మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమాభారతి కూడా సాధువే. తాజాగా మరో సాధువు యోగి ఆదిత్యనాథ్ కు ఉత్తర్ ప్రదేశ్ పగ్గాలు అప్పగించారు.

లోక్ సభలోనూ సాధువుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. వీరిలో బీజేపీ నుంచే అధికులు ఉండగా బిజూ జనతా దళ్ నుంచి ఒకరు ఉన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ నుంచి అయిదుగురు సాధువులు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, ఒడిశా నుంచి ఒకరు ఎంపీలుగా పనిచేస్తున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు. కాగా.. ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా వెళ్తుండడంతో లోక్ సభలో సాధువుల సంఖ్య ఏడుకి తగ్గనుంది.

* ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన యోగి ఆదిత్యనాధ్ ఇప్పటికి అయిదుసార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుత లోక్ సభలోనూ ఆయన సభ్యుడు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

* సాధ్వి నిరంజన్ జ్యోతి: ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ నుంచి బీజేపీ టిక్కెట్ పై ఎంపీగా గెలిచారు.

* సాధ్వి సావిత్రి భాయి పూలె: ఈమె కూడా బీజేపీ ఎంపీ. ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రయిచ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

* సరస్వతి సుమేదానంద: రాజస్థాన్ లోని సికార్ నియోజకవర్గ ఎంపీ. ఈయన కూడా బీజేపీ ఎంపీనే.

* ఉమాభారతి: ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఈమె ఝాన్సీ నియోజకవర్గ ఎంపీ. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

* సాక్షిమహారాజ్: ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ నియోజకవర్గ ఎంపీ. బీజేపీలో వివాదాస్పద వ్యాఖ్యలకు ఈయన పెట్టింది పేరు.

* యోగి చాంద్ నాథ్: రాజస్థాన్ లోని ఆల్వార్ నియోజకవర్గ ఎంపీ. బీజేపీకి చెందిన ఈయన రాజస్థాన్ లో ఓ మఠానికి అధిపతి.

* ప్రసన్న కుమార్ పట్సానీ: భువనేశ్వర్ ఎంపీ. బిజూ జనతాదళ్ నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ కు కుడిభుజం.

కాగా రాజకీయాల్లో సన్యాసుల ప్రాధాన్యంపై సరికొత్త సరదా భాష్యాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేవారు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటున్నామని అంటారు. కానీ.. రాజకీయాలు సన్యాసులతో నిండిపోవడాన్ని రాజకీయ సన్యాసం అనాలని కొందరు సూచిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/