Begin typing your search above and press return to search.

'కశ్మీర్ ఫైల్స్' చూసి రగిలిన వారు.. ఇప్పుడేమంటారు?

By:  Tupaki Desk   |   1 Jun 2022 4:35 AM GMT
కశ్మీర్ ఫైల్స్ చూసి రగిలిన వారు.. ఇప్పుడేమంటారు?
X
కశ్మీర్ లో ఏం జరుగుతుందన్న దానిపై చాలామందికి అవగాహన తక్కువ. ఆ మాటకు వస్తే సమకాలీన కాలం.. దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం కశ్మీర్ గడ్డ మీద ఏం జరిగిందన్న దాని మీద సామాన్యులకే కాదు.. సీనియర్ ఐఏఎస్ అధికారులకు సైతం పెద్దగా తెలీని ఉదంతాల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చారు కశ్మీర్ ఫైల్స్ మూవీలో. దీంతో ఈ సినిమా పెను సంచలనమే కాదు.. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

80 దశకంలో కశ్మీర్ గడ్డ మీద ఉన్న హిందువుల్ని తరిమికొట్టే ప్రయత్నం భారీగా జరగటం.. ఈ సందర్భంగా పలువురు అమాయకుల్ని దారుణంగా వధించిన వైనాన్ని కశ్మీర్ ఫైల్స్ లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సినిమాను చూసినోళ్లంతా షాక్ తినటంతో పాటు.. మన దేశంలో ఇంతటి దారుణం జరగటమా? అంటూ రగిలిపోయారు. తీవ్ర ఆవేశాన్ని ప్రదర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఈ అంశాల్ని ప్రస్తావిస్తూ.. అప్పట్లో మోడీ ప్రధానమంత్రిగా లేని కారణంతోనే ఇలా జరిగిందని.. ఆయనే ఉంటే ఇలాంటి దారుణాలు జరిగేవి కావన్నారు. అయితే.. ఇటీవల కాలంలో కశ్మీర్ లోయలోని పలువురు హిందువులను టార్గెట్ చేసి మరీ ఉగ్రవాదులు హతమారుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. స్కూల్లో పని చేసే టీచర్లను లక్ష్యంగా చేసుకొని చంపేస్తున్నారు.

తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటుచేసుకుంది. సాంబా జిల్లాకు చెందిన 36 ఏల్ల రజనీ బాలా అనే ప్రభుత్వ టీచర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఆమెపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి.. పారిపోయారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. మే నెలలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల చేతిలో బలైన రెండో ముస్లిమేతర ప్రభుత్వ ఉద్యోగిగా చెబుతున్నారు. ఈ హత్యకు ముందు కశ్మీర్ పండిట్ అయిన రాహుల్ భట్ ను కూడా ముష్కరులు హతమార్చారు.

ఒక్క మే నెలలో కశ్మీర్ లో జరిగిన ఏడో హత్యగా దీన్ని చెబుతున్నారు. తాజా దారుణంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరాయుధులైన పౌరులపై ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులకు అమాయకులు పెద్ద ఎత్తున మరణిస్తున్నారు.

కశ్మీర్ లో సాధారణ వాతావరణం నెలకొందని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని.. అలాంటి వాతావరణమే ఉండి ఉంటే.. ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ. తాజా హత్య నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించాలని.. లేదంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లోని పండిట్లకు వార్నింగ్ ఇచ్చాయి. ఫాసిస్టు పాలకులకు తొత్తులుగా మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తామని స్పష్టం చేశాయి. లోయను వదిలి వెళ్లాలని.. లేదంటే చావటానికి సిద్ధంగా ఉండాలంటూ ఉగ్రసంస్థల హెచ్చరికలు చూసినప్పుడు కశ్మీరీ ఫైల్స్ మూవీకి ఏ మాత్రం తేడా లేని పరిస్థితి ఇప్పుడు కూడా ఉందన్న అభిప్రాయం కలుగక మానదు. మోడీ హయాంలోనూ ఇలాంటి పరిస్థితి దేనికి నిదర్శనం?