Begin typing your search above and press return to search.

గుళ్లు ఓపెన్ కావటానికి ముహుర్తం డిసైడ్ చేశారా?

By:  Tupaki Desk   |   26 May 2020 3:45 AM GMT
గుళ్లు ఓపెన్ కావటానికి ముహుర్తం డిసైడ్ చేశారా?
X
కలలో కూడా ఊహించని అంశాలెన్నో లాక్ డౌన్ పుణ్యమా అని చోటు చేసుకోవటం తెలిసిందే. పలు సడలింపులు చేపట్టినప్పటికీ సాధారణ పరిస్థితికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. నిత్యం వేలాదిమంది భక్తులు వెళ్లే గుళ్లను సైతం మూసివేయటం తెలిసిందే. అయితే.. రోజువారీ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. గుళ్లను ఎప్పుడు ఓపెన్ చేస్తారా? అన్న ఆశతో కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ లో దేవాలయాలు భక్తుల కోసం ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

గుళ్లకు భక్తుల్ని అనుమతించే విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. గుళ్లకు సామాన్య భక్తుల్ని అనుమతించే వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆయా దేవాలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలు (సేవలు) లేకుండా చూడాలన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇలాంటి సేవలకు భారీగా భక్తులు హాజరవుతారని చెబుతున్నారు.

అయితే.. గుళ్లు తెరిచిన వెంటనే ప్రత్యేక పూజలకు అనుమతి ఇవ్వరని చెబుతున్నారు. ఎందుకంటే.. ఒకే సమయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో.. ప్రత్యేక పూజలకు అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి బదులుగా భౌతిక దూరాన్ని పాటిస్తూ.. దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నారు. అంతేకాదు.. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విడిది సౌకర్యం ఉంటుంది.

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఉండేందుకు వీలుగా రూములు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొంతకాలం రూముల్ని భక్తులకు ఇచ్చేందుకు అనుమతించరు. భక్తులు ఎవరైనా సరే.. దేవాలయాన్ని తెరిచి ఉంచిన సమయంలో దర్శనం చేసుకొని వెళ్లటమే తప్పించి.. అక్కడ ఉండేందుకు అనుమతి ఇవ్వరని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. లాక్ డౌన్ ముందు లాంటి పరిస్థితులు చోటు చేసుకోవటానికి చాలానే సమయం పట్టే అవకాశం ఉందని చెప్పక తప్పదు.