Begin typing your search above and press return to search.

బాలయ్య అసలైన అడ్డు ...వైసీపీ చేతులెత్తేసినా కూడా...?

By:  Tupaki Desk   |   7 Sep 2022 12:30 AM GMT
బాలయ్య అసలైన అడ్డు ...వైసీపీ చేతులెత్తేసినా కూడా...?
X
ప్రముఖ సినీ నటుడు, నందమూరి తారకరాముని సినీ రాజకీయ వారసుడు బాలక్రిష్ణ కత్తికు ఎదురు ఉంటుందా. ఆయన తలచుకోవాలే కానీ సీరియస్ గా దృష్టి పెట్టాలే కానీ ఏ రంగంలో అయినా ఆయన వీరంగమే కదా. ఇది బాలయ్య అభిమానుల గట్టి నమ్మకం. నిజంగా బాలయ్య అలా కనుక యాక్టివ్ గా ఉంటే ఆయన్ని కాదని ముందుకు వెళ్ళే వారే ఉండరు. అయితే బాలయ్య కేవలం సినిమాలకే పరిమితం అయ్యారు. రాజకీయాల్లో సైడ్ రోల్ చాలు అనుకున్నారు.

అందుకే ఆయన 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా చివరికి చిన్నపాటి మంత్రి పదవి కూడా దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేబ్ భయంకరంగా వీస్తున్న టైం లో కూడా యోధానుయోధులు ఓడిన చోట బాలయ్య జెండా ఎగరేశారు. సీమలో మొత్తం 52 సీట్లు ఉంటే అందులో టీడీపీ గెలిచింది కేవలం మూడంటే మూడు. ఆ మూడింటిలో బావ చంద్రబాబుతో పాటు బాలయ్య సీటు కూడా ఉంది.

ఇక 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బాలయ్య సైతం దూకుడు మీద ఉన్నారు. వీలు దొరికినపుడల్లా హిందూపురంలో ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కరోనా టైం లో కూడా తన నియోజకవర్గం ప్రజల వద్దకు వెళ్ళి వారిని ఆదుకున్నారు. ఇక లేటెస్ట్ గా ఆరోగ్య రధాన్ని ప్రారంభించి ప్రజల ఇంటి వద్దకే మొబైల్ వైద్య సేవలు అందేలా చూస్తున్నారు.

ఇక హిందూపురంలో అధికార పార్టీ వీక్ గా ఉంది. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్సెస్ నవీన్ నిశ్చల్, ఇంకా మరిన్ని వర్గాలతో ఫ్యాన్ పార్టీ లో ఉక్క బోత ఉంది. బాలయ్య వంటి చరిష్మాటిక్ లీడర్ ని ఢీ కొట్టాలీ అంటే ఇప్పటికే వైసీపీలో బలమైన నాయకుడు అందరినీ ఏకత్రాటి మీద కలుపుకుని పోవాలి. కానీ హిందూపురంలో ఆ సీన్ ఏమీ లేదు. రాయలసీమ జిల్లాల ఇంచార్జిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి ముందర హిందూపురం పంచాయతీ కూడా వచ్చింది. దాంతో ఆయన ఏమీ చేయలేక జగన్ వద్దకే ఈ గొడవలను తీసుకెళ్తున్నారని టాక్.

హిందూపురం వైసీపీలో మూడు ముక్కలాట సాగుతోంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారి నుంచి వారికే ముప్పు ఉంటుంది. దాంతో అతి సునాయాసంగా టీడీపీ ఇక్కడ గెలవడం ఖాయం. అవతల వైపు ఉన్నది బాలయ్య. దాంతో గెలుపు పిలుపు చాలా గట్టిగా వినిపిస్తుంది. హిందూపురం అంటే నందమూరి పురం అని ఇప్పటికే పేరు తెచ్చుకుంది. అలాంటి హిందూపురంలో మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య తాపత్రయపడుతున్నారు.

ఇక 2024 ఎన్నికల నోటిఫికేషన్ రావడం తరువాయి ఎన్నికలు లాంచనం బాలయ్య విజయం ఖాయమని అంతా చెబుతారు. కానీ బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని వైసీపీ ఆపలేకపోయినా సొంత పార్టీలోనే ఆపే శక్తులు ఉన్నాయని అంటున్నారు. మూడవసారి హిందూపురం నుంచి బాలయ్య గెలవాలీ అంటే ఆయనకు చంద్రబాబు టికెట్ ఇవ్వాలి. మరి బాబు టికెట్ ఇస్తారా అంటే ఇక్కడే డౌట్లు వస్తున్నాయట.

బాలయ్యను ఈసారి రాయలసీమ జిల్లాల ప్రచార బాధ్యతలను చూసుకోమని అధినాయకత్వం చెబుతుంది అంటున్నారు. తన సీట్లో తాను గెలవడం కాదు, సీమలో తన బలాన్ని చూపించి పార్టీని గెలిపించమని కోరుతుంది అని అంటున్నారు. ఇక హిందూపురం నుంచి చంద్రబాబు వారసుడు, బాలయ్య అల్లుడు లోకేష్ పోటీ చేస్తారు అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. లోకేష్ కన్ను ఈ సీటు మీద ఉంది అంటున్నారు.

నిజానికి లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అని ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్న ప్రచారం. కానీ ఇపుడు అక్కడ సామాజిక రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. టీడీపీలో ఉన్న నాయకులు అంతా వైసీపీలోకి చేరిపోతున్నారు. ముఖ్యంగా బలమైన బీసీ నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరడంతో టీడీపీలో ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు

ఇక మరో విషయం ఏమిటి అంటే వచ్చే ఎన్నికలు కీలకం. లోకేష్ తన సీట్లోనే తానుగా ఫైట్ చేసుకుని మొత్తానికి గెలిస్తే గెలవవచ్చు కానీ ఏపీ అంతా తిరిగి మిగిలిన చోట్ల ప్రచారం చేయడంలో వెనకబడతారు అన్న చర్చ కూడా ఉందిట. అందుకే ఈ రిస్క్ ఎందుకు సేఫ్ జోన్ గా హిందూపురం నుంచి లోకేష్ పోటీ చేస్తే చాలా ఈజీగా గెలుస్తారు. అక్కడ వైసీపీకి పట్టు లేదు అన్న ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో లోకేష్ రాష్ట్రమంతా ప్రచారం చేసుకునేందుకు వీలు పడుతుంది అని కొత్త ప్లాన్స్ చేస్తున్నారుట.

ఇదంతా బాగానే ఉంది కానీ అల్లుడు గారు హిందూపురం వస్తే మామ బాలయ్య సంగతేంటి అంటే బాలయ్యకు రాజ్యసభ ఇస్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే బాలయ్యను పెద్దల సభకు పంపుతారు అని అంటున్నారు. అంటే బాలయ్యను ఆ విధంగా ఏపీ రాజకీయాల నుంచి తప్పిస్తారా అని ఎవరైనా అనుకుంటే అది వేరే చర్చ. మొత్తానికి బాలయ్యకు హ్యాట్రిక్ విజయం దక్కుతుందా అంటే దానికి అల్లుడు గారే అడ్డు పుల్ల అవుతారా అంటే ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం చూస్తే అదే నిజమని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.