Begin typing your search above and press return to search.

హాట్సాఫ్ బాలయ్య... హ్యాట్రిక్ ఖాయమయ్యా

By:  Tupaki Desk   |   17 Oct 2022 10:04 PM IST
హాట్సాఫ్ బాలయ్య... హ్యాట్రిక్ ఖాయమయ్యా
X
నాయకుడు అన్న వాడు సమయానికే రావాలి. ఊరకే ఎదురుగా అవసరం లేనపుడు ఉంటే లాభమేంటి. ఆపద ఉన్నపుడు నేనున్నాను అని వచ్చి భుజం తట్టి సాయం చేసేవాడే నాయకుడు. నందమూరి బాలక్రిష్ణ ఆ విషయంలో తన సొంత నియోజకవర్గం హిందూపురం జనం చేత జేజేలు అందుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ వినీ ఎరగని రీతిలో అనంతపురం జిల్లాకు వరదలు వచ్చాయి.

ఆ వరదలతో ఇల్లూ వాకిలీ అన్నీ కూడా నీటిమయమైపోయాయి. ఆఖరుకు కట్టుబట్టులు కూడా లేక అంతా నీళ్ళలోనే కాపురం చేస్తున్నారు. ఇవన్నీ కూడా టీవీలలో వచ్చాయి. అంతే విషయం తెలుసుకున్న బాలయ్య తన హిందూపురం నియోజకవర్గంలో వాయువేగంతో వెళ్ళారు. ఆయన ప్రతీ ఇంటికీ వెళ్ళి వారిని పలకరించారు.

మోకాళ్ల లోతున నీళ్ళు ఉంటే వాటిలోనే ఆయన నడచుకుంటూ బాధితులను పరామర్శించారు. బాలయ్య వైట్ అంట్ వైట్ డ్రెస్ లో ఉంటూ కూడా బురద నీటిలో చటుక్కున దిగిపోయారు. తనకు ఆ బురద అంటుతుంది అన్న ఆలోచన సైతం లేకుండా ఆయన జనం ఇళ్ళలలోకి వెళ్ళడం చూసిన వారు హాట్సాఫ్ బాలయ్య అని అనకుండా ఉండలేకపోతున్నారు.

బాలయ్య నియోజకవర్గంలో ఇబ్బందులలో ఉన్న ప్రాంతాలను అన్నీ సందర్శించి వారికి నిత్యావసరాలు అందించారు. అంతే కాదు వారికి తన సొంత నిధుల నుంచి సహాయ కార్యక్రమాలను కూడా చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. దాంతో బాధిత జనం అంతా మా బాలయ్యకు జై అని అంటున్నారు.

నిజానికి బాలక్రిష్ణ హిందూపురం నుంచి గెలిచినా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటారు. దాని మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో బాలయ్య కనిపించడంలేదు అని ప్రచారం చేశారు. ఇక పోలీస్ స్టేషన్లో బాలయ్య మిస్సింగ్ అంటూ హిజ్రాలతో కేసులు పెట్టించారు.

అయితే బాలయ్య మాత్రం ఆపద ఉంది అంటే తానుగానే కదలి వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే జనాలు తలచుకోకుండానే ప్రత్యక్షం అవుతున్నారు. కరోనా వంటి ప్రకృతి విపత్తు వేళ కూడా బాలయ్య వచ్చి హిందూపురంలో సొంత డబ్బులతో ఆసుపత్రులను బాగు చేయించారు.

అలాగే ఎన్టీయార్ ఆరోగ్య రధాన్ని ఈ మధ్యనే ప్రారంభించారు. ఇపుడు వరద బాధితులకు సహాయం చేస్తూ సర్కార్ కంటే తానే ముందు అని అనిపించుకున్నారు. మరి హిందూపురం జనాల ఓట్లనే కాదు మనసులను కూడా గెలుచుకున్న బాలయ్య హ్యాట్రిక్ విక్టరీ కొట్టడం ఖాయమనే టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఎనీ డౌట్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.