Begin typing your search above and press return to search.

హిందువులు ముస్లింల‌కు ఉన్న తేడా ఇది

By:  Tupaki Desk   |   24 Jun 2018 4:17 AM GMT
హిందువులు ముస్లింల‌కు ఉన్న తేడా ఇది
X
మ‌న‌దేశంలో కొత్త పోక‌డ తెర‌మీద‌కు వ‌చ్చింది. రిజిస్ట్రార్ జనరల్ - భారత జనాభా లెక్కల కమిషనర్ విడుదల చేసిన గ‌ణాంకాలు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. ప్రజలు ఉపాధి లేదా వృత్తిని ఎంపిక చేసుకునే విషయంలో కూడా మతం ప్రభావం ఉంటున్నదనే విషయాన్ని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హిందువులు ఎక్కువగా వ్యవసాయ వృత్తిని చేపడుతుండగా.. ముస్లింలు చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు. దేశంలో వ్యవసాయంలో నిమగ్నమైన ప్రధాన వృత్తిదారుల్లో 45.40 శాతం హిందువులేనని వెల్లడైంది. అదేసమయంలో ముస్లింలు మాత్రం వ్యవసాయేతర వృత్తులను ఎంచుకుంటున్నారు. దాదాపు 60 శాతం ముస్లింలు పారిశ్రామిక ఉద్యోగాల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన హిందువులు 28 శాతం ఉన్నారు. ఉత్పత్తి రంగంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్షరాస్యత లేమి కారణంగా వారు ప్రాధాన్యం కలిగిన ఉద్యోగాలను పొందలేకపోతున్నారు.

రిజిస్ట్రార్ జనరల్ - భారత జనాభా లెక్కల కమిషనర్ విడుదల చేసిన 2011 జనాభా వివరాల నివేదిక ప్రకారం..ఏడేళ్ల‌ వయసు దాటిన వారిలో 42.72 శాతం మంది ముస్లింలు నిరక్షరాస్యులుగా ఉండగా.. అదే హిందువుల్లో ఆ శాతం 36.40గా ఉంది. ఉత్తర భారతంలో ముస్లింల జనాభా ఎక్కువ. వీరు సాధారణంగా కళాకారులు. చిన్నతరహా పరిశ్రమలుగాఉన్న నేత - చేనేత - కుమ్మరి - కమ్మరి - వడ్రంగి వంటి పనుల్లో వీరు నిమగ్నమై ఉన్నారు. ఎక్కువశాతం ముస్లింలు వ్యవసాయదారులు కాదు అని జాతీయ బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా పనిచేసిన పీఎస్ కృష్ణన్ చెప్పారు. భూమి ఎక్కువగా లేకపోవటం వల్లే ముస్లింలు ఉత్పత్తి రంగాన్ని ఎంచుకోవడానికి కారణమవుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 2001-2011 మధ్య పదేళ్ల‌లో ముస్లిం జనాభా 0.8 శాతం వృద్ధితో రూ.17.22 కోట్లకు చేరగా.. హిందువుల జనాభా 0.7 శాతం క్షీణతతో రూ.96.63 కోట్లకు చేరింది. 2001 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా మొత్తం 102 కోట్లు కాగా అందులో హిందువులు 82.75 కోట్లు (80.45 శాతం) - ముస్లింలు 13.8 కోట్లు (13.4 శాతం) ఉన్నారు. అయితే కులాల వారీగా వివరాలను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు.