Begin typing your search above and press return to search.

సోము వీర్రాజుకు అంత సీను ఉందా?

By:  Tupaki Desk   |   29 July 2020 5:00 PM GMT
సోము వీర్రాజుకు అంత సీను ఉందా?
X
నడిపించే నాయకుడు ఎలా ఉండాలి.. ముందుండి పోరాడాలి.. ఎన్నికల కార్యక్షేత్రంలో గెలిచుండాలి. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించాలి. క్యాడర్ లో అపారమైన ప్రేమ అభిమానులుండాలి. నాయకుడంటే ఇలా ఉండాలిరా అని క్యాడర్ మీసం మెలేయాలి. ప్రత్యర్థులపై విరుచుకుపడాలి.. అబ్బో.. ఇలాంటి చాలా అంశాలు ఒక రాజకీయ నేతను అగ్రస్థానాన కూర్చుండబెడుతాయి. ఇటు కేసీఆర్ ను చూసినా.. అటు జగన్ ను చూసినా ప్రజల్లోంచి వచ్చిన నాయకులే.. తెలంగాణలో కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్ సైతం కార్పొరేటర్ నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచి యువతలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన ఫైర్ బ్రాండ్ నేత. మరి ఏపీకి కొత్తగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వీరందరికీ సరితూగగలడా? సోము వీర్రాజు ఎన్ని ఎన్నికల్లో గెలిచాడు.? ఎంతమందిని ఓడించాడు.. ఎంతమందిని తనతో నడిపించాడు? ఆయన వెనుక ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? అంటే ఎవరూ లేరనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎన్నికల కార్యక్షేత్రంలో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని సోము వీర్రాజును బీజేపీ ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ప్రజల్లోంచి రాని ఈ నాయకుడు పరిపాలన దక్షుడు అవుతాడా? బీజేపీని ఏపీలో పరుగులు పెట్టిస్తాడా అన్నది చూద్దాం..

బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. మంచి కాపునాయకుడిగా ఉన్నాడు. ఆయనను తీసి సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడిని చేసింది. మరి సోము వీర్రాజు చరిత్ర ఏంటి? ఆయన అసలు బీజేపీ అధ్యక్షుడిగా కరెక్టేనా తెలుసుకుందాం.

*సోము వీర్రాజు నేపథ్యం..
సోము వీర్రాజు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా కాతేరు గ్రామం. 1978లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. 1980లో రాజమండ్రి బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ శాఖల్లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిందని అంటారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా 2015లో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అసెంబ్లీలో తమ వాణి గట్టిగా వినిపించడంలో సిద్ధహస్తలు. మాటల్లో ఉన్న వీర్రాజు ప్రజా నాయకుడిగా మాత్రం నిరూపించుకోలేకపోయారనే అపవాదు ఉంది.

*కనీసం కార్పొరేటేర్ గా కూడా గెలవని సోము వీర్రాజు
రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు అక్కడి ప్రజల్లో ఒక సాదాసీదా నేత.. కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తిగా నేతలు చెబుతుంటారు. 2004లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కడియం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో సొంతంగా పోటీచేసి గెలిచిన దాఖలాలు సోము వీర్రాజుకు లేవు. ఇక క్షేత్రస్థాయిలో సోము వీర్రాజుకు క్యాడర్ లేదు. ఇక బండి సంజయ్ లా అభిమానించే నాయకగణం అస్సలే లేదు. గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన నాయకుడు కాకపోవడంతో అతడికి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు, నేతల బలం లేకుండా పోయిందన్న వాదన ఉంది. ఇక బీజేపీ నాయకులతోనూ సోము వీర్రాజుకు పెద్దగా సత్సంబంధాలు లేవు.

*మీడియాలో హైలెట్ చేసినంత లేదా?
ఇక కన్నాను తీసేసి సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడిగా చేయగానే.. టీడీపీ పని ఖతం.. వైసీపీకి చెక్.. జనసేనతో అధికారం అని మీడియాలో హైలెట్ అయ్యింది. నిజానికి పవన్ కళ్యాణ్ లానే సోము కూడా ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి అని ఏ మీడియా కూడా ఆరా తీయలేకపోయింది. ప్రజల్లోంచి వచ్చిన నాయకులే ఎదగడానికి ఆపసోపాలు పడుతుంటే నామినేట్ అయిన సోము వీర్రాజు ఆ లెవల్లో ఎలా పోరాడగలడన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. మీడియా ఊదరగొట్టడం తప్పించి పార్టీలో.. గ్రౌండ్ లెవల్లో పెద్దగా బలం లేని వ్యక్తి సోము వీర్రాజు అని రాజమండ్రిలో ఎవరినీ అడిగినా చెబుతారు.

*బీజేపీ మళ్లీ రాంగ్ స్టెప్పా?
తెలంగాణలో యువకుడు.. బీసీ.. పోరాట యోధుడైన ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కి ఇచ్చి అక్కడ పార్టీని పట్టాలెక్కించిన బీజేపీ.. ఏపీలో మాత్రం అలాంటి యువకుడికి అవకాశం ఇవ్వకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో ఫ్లాప్ అయిన వ్యక్తికి అప్పజెప్పడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రాలో కూడా మంచి యువకుడికి.. గ్రౌండ్ లెవల్ నుంచి కష్టపడి పైకొచ్చి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తికి పగ్గాలు అప్పజెప్పి ఉంటే మరో లెవల్లో బీజేపీ ఉండేది. పార్టీ బలోపేతం అయ్యేది. కానీ సోము వీర్రాజుకు నోరు మాత్రమే ఉందంటారు. మీడియాలో గట్టిగా మాట్లాడే వీర్రాజు.. వెనుకకు చూసుకుంటే బలమైన ప్రజాబలం.. నేతల బలం లేదన్నది అంగీకరించాల్సిన వాస్తవం అంటున్నారు. వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిని చేసి బీజేపీ తప్పు చేసిందా అన్న విశ్లేషణ కూడా తెరపైకి వస్తోంది.

*బీజేపీ గ్రూపులను వీర్రాజు మెయింటేన్ చేస్తాడా?
ఏపీ బీజేపీ గ్రూపులుగా విడిపోయింది. ఒకటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రూపు.. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన గ్రూపు.. స్వతహాగా బీజేపీలో ఉన్న గ్రూపు.. ఈ ఏ గ్రూపుతోనూ సోము వీర్రాజుకు అసలు సత్సంబంధాలే లేవు. సోము వీర్రాజును వీళ్లంతా అసలు గుర్తించరు. మరి అలాంటి నేత బీజేపీని ఎలా లీడ్ చేస్తారన్నది ఇక్కడ ప్రశ్న.

*ప్రాక్టికల్ గా సోము వీర్రాజు సరైన వ్యక్తియేనా?
ఆర్ఎస్ఎస్ నుంచి రావడం.. ఢిల్లీలో కొందరు బీజేపీ నేతల స్నేహం వల్ల.. బలంగా వాదించే వ్యక్తిత్వం ఉండడం వల్లే సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది కానీ.. ప్రజా నాయకుడిగా ఈయనకు ఈ పదవి దక్కలేదన్నది వాస్తవం అని విశ్లేషకులు చెబుతున్నారు. అందరినీ కలుపుకొని వెళ్లే నాయకత్వ లక్షణాలు సోములో లేవన్నది అంగీకరించాల్సిన వాస్తవం. ఎందుకంటే ఈయన ఏ ఎన్నికల్లో గెలవలేదు.. లీడ్ చేయలేదు. దీంతో అందరినీ కలుపుకుపోగల సామర్థ్యం ఈయనకు ఉందా లేదా అన్నది ముందు ముందు తేలనుంది. 2024 వరకు బీజేపీని ఏపీలో అధికారంలోకి తీసుకొస్తాడా? అందరినీ ఏకతాటిపైకి తెచ్చి అధికారం సాధిస్తాడా? జనసేనతో కలుపుకొని పోతాడా? సోము నియామకం బీజేపీకి కలిసి వస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి.