Begin typing your search above and press return to search.

టీమిండియాను చితక్కొట్టిన హేల్స్ వివాదాస్పద గతం తెలుసా?

By:  Tupaki Desk   |   11 Nov 2022 10:23 AM GMT
టీమిండియాను చితక్కొట్టిన హేల్స్ వివాదాస్పద గతం తెలుసా?
X
అతడి ఆట ఎంత విధ్వంసకరమో.. అతడి ప్రవర్తన అంత వివాదాస్పదం.. క్రీజులో బ్యాట్ తో ఎంత దూకుడైనవాడో.. బయట వ్యక్తి కూడా అంతే దుందుడుకు.. అందుకే ప్రతిభ ఉన్నా జాతీయ
జట్టుకు దూరమయ్యాడు. ఓ దశలో జట్టు సభ్యులే అతడు జట్టులో ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. అలాంటివాడే ఇప్పుడు టి20 ప్రపంచ కప్ లో జట్టు ఫైనల్స్ కు చేరడంలో కీలకంగా
నిలిచాడు. అతడు ఇంకెవరో కాదు ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్.

ఎత్తును ఉపయోగించుకుని...

గురువారం నాటి సెమీస్ లో టీమిండియా బౌలర్లను ఊచకోత కోసిన హేల్స్.. దాదాపు 6.5 అడుగుల పొడగరి. ఆ ఎత్తు ముందు పొట్టిగా ఉండే, పేస్ తక్కువగ ఉండే భారత బౌలర్ల ఎత్తుగడలు పనిచేయలేదు. పొడగరి హేల్స్.. వారు వేసే బంతులను అలవోకగా బాదేశాడు. మ్యాచ్ చూసినవారు ఎవరికైనా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. బ్యాట్ ను పుల్లలా వాడుతూ హేల్స్ బంతిని అమాంతం స్టాండ్స్ లోకి పంపిన తీరును చూస్తే ఎత్తు అతడికి ఎంత అడ్వాంటేజ్ గా పనిచేసిందో అర్థమవుతుంది.


బార్ లో గొడవ...

2017 సెప్టెంబరులో బ్రిస్టల్ లోని ఓ బార్ వద్ద ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు ఓ వ్యక్తిని చితకబాదారు. అలా దాడిచేసిన వారిలో ఒకరు అలెక్స్ హేల్స్ అయితే మరొకరు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. వీరిలో స్టోక్స్ సస్పెన్షన్ అనంతరం ఏడాదిలోపే తిరిగి జట్టులోకి వచ్చి టెస్టు కెప్టెన్ కూడా అయ్యాడు. కానీ, హేల్స్ అంతర్జాతీయ క్రీడా జీవితం మాత్రం రెండు నెలల కిందటి దాకా సందేహాస్పదమే. కానీ, అనూహ్యంగా జట్టులోకి వచ్చి ఇప్పుడు తన స్థాయి ఆటతో దుమ్మురేపుతున్నాడు.


2019 వన్డే ప్రపంచ కప్ చాన్స్ మిస్

2015 వన్డే ప్రపంచ కప్ లో దారుణ పరాజయంతో ఇంగ్లండ్ జట్టును పూర్తిగా పునర్ వ్యవస్థీకరించారు. అలిస్టర్ కుక్ వంటి టెస్టు ఆటగాళ్లను తొలగించి.. హిట్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా పునర్ నిర్మాణ ప్రక్రియలో కీలకంగా నిలిచినవాడు అలెక్స్ హేల్స్. 2019 ప్రపంచ కప్ కు ముందుగా ప్రకటించిన జట్టులోనూ హేల్స్ పేరుంది. కానీ, డ్రగ్స్ పరీక్షలో విఫలమై 21 రోజుల నిషేధం ఎదుర్కొన్నాడు. అనతరం ఇంగ్లండ్ బోర్డు అతడిని తప్పించింది. అలా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ.. సొంతగడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచ కప్ నకు హేల్స్ ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కాలేకపోయాడు.

దీనికి కారణం అతడి దుందుడుకు ప్రవర్తనే. వాస్తవానికి 2017 బ్రిస్టల్ బార్ ఉదంతం తర్వాత హేల్స్ పై విధించిన నిషేధం గడువు ప్రపంచ కప్ నాటికే ముగిసిపోయింది. కానీ, జట్టు సభ్యుల విశ్వాసం కోల్పోయాడంటూ నాటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సహా ఎక్కువమంది జట్టు సభ్యులు హేల్స్ పునరాగమనాన్ని వ్యతిరేకించారు. అలా మోర్గాన్ కెప్టెన్ గా ఉన్నన్ని రోజులూ హేల్స్ ఇంగ్లండ్ కు ఆడలేకపోయాడు.


రాయ్, బెయిర్ స్టో గాయాలతో

ఇంగ్లండ్ టి20 జట్టంటే అందరూ హిట్టర్లే. తుది జట్టులో చోటు కోసం విపరీతమైన పోటీ. అయితే, హేల్స్ కు లక్ కలిసొచ్చింది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టో ఇద్దరికీ ఓకేసారి గాయాలై జట్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో తప్పనిసరై హేల్స్ ను పిలవాల్సి వచ్చింది. ముగిసిపోయిందనుకున్న అతడి అంతర్జాతీయ కెరీర్ అలా మళ్లీ మొదలైంది.

6.5 అడుగుల పొడగరి..

బహుశా ప్రస్తుత అంతర్జాతీయ క్రికెటర్లలో పొడగరి క్రీడాకారుల్లో హేల్స్ ఒకడు. సగటు ఎత్తు ఉండేవారు కూడా అతడి పక్కన నిల్చుంటే పొట్టిగా కనిపిస్తారు. దాదాపు 6.5 అడుగుల పొడవుండే హేల్స్.. ఎత్తులో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్, దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ మార్కో జన్ సేన్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమీసన్ తర్వాతి స్థానంలో ఉంటాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.