Begin typing your search above and press return to search.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : తీర్పు చెప్పిన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్‌ ఎవరు?

By:  Tupaki Desk   |   30 Sep 2020 2:00 PM GMT
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : తీర్పు చెప్పిన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్‌ ఎవరు?
X
దాదాపుగా గత మూడు దశాబ్ధాలుగా సంచలనం రేపుతున్నబాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ల‌క్నోలోని సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువ‌రించింది. మ‌సీదు కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని.. ఈ కేసులో నిందితులుగా ఉన్న‌వారంతా నిర్దోషులే అని న్యాయ‌మూర్తి తీర్పునిచ్చారు. సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ 2000 పేజీలు ఉన్న తీర్పు కాపీనీ చదివి తీర్పు వెల్లడించింది. ఈ కేసులలో మొత్తం 48 మంది మీద అభియోగాలు నమోదుకాగా.. ఇందులో 16 మంది మరణించారు. మిగతా 32 మంది సెప్టెంబర్ 30న కోర్టు ఎదుట హాజరుకావాలని ఈ మద్యే ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఇందులో కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కరోనా సోకడంతో హాజరుకాలేక పోయారు. వయోబారం కారణంతో మురళీ మనోహర్ జోషి, ఎల్ కే అద్వాణీలు హాజరు కాలేదు. 26 మంది కోర్టు ముందుకు హాజరైయ్యారు. అయితే, ఈ కేసు తుది తీర్పు చెప్పిన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ ఎవరు అంటూ ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో అయన గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌ లోని జౌన్‌ పుర్ జిల్లాలో పఖాన్‌ పుర్ గ్రామంలో సురేంద్ర కుమార్ జన్మించారు. ఆయన తండ్రి పేరు రామకృష్ణ యాదవ్. 31ఏళ్ల వయసులో రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్‌ కు సురేంద్ర ఎంపికయ్యారు. ఫైజాబాద్‌ లో అడిషనల్ మున్సిఫ్‌గా ఆయనకు తొలి పోస్టింగ్ వచ్చింది. గాజీపుర్, హర్దోయి, సుల్తాన్‌పుర్, ఎటావా, గోరఖ్‌పుర్ తదితర జిల్లాలో పనిచేసిన అనంతరం లఖ్ ‌నవూ జిల్లా జడ్జిగా ఆయన నియమితులయ్యారు. గతేడాది లఖ్‌నవూ జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందేటప్పుడు బార్ అసోసియేషన్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే, సుప్రీం కోర్టు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా కొనసాగుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసును పూర్తి చేయాలని ఆయనకు సూచించింది.అందుకే ఆయన జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందినప్పటికీ.. ప్రత్యేక న్యాయమూర్తిగా కొనసాగి ఈ కేసులో తుది తీర్పు వెల్లడించారు.

పదవీ విరమణ పొందే జడ్జి పదవీ కాలాన్ని పొడిగించడమంటే.. అది ఒక చరిత్రాత్మక నిర్ణయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టుకుండే ప్రత్యేక అధికారాలతో ఈ నిర్ణయం తీసుకుంటారు.ఈ ఆర్టికల్ ప్రకారం.. కేసులో సంపూర్ణ న్యాయం జరిగేలా చూసేందుకు సుప్రీం కోర్టు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 142ను సుప్రీం కోర్టు చాలా సార్లు ఉపయోగించింది. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఒక ట్రయల్ కోర్టు జడ్జిని కేసు పూర్తయ్యే వరకూ అదే పదవిలో కొనసాగాలని చెప్పడం మాత్రం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లో జడ్జి పదవీ కాలం పొడిగించే నిబంధనలు లేవని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెప్పడంతో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ పూర్తయ్యేవరకూ బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఎలాంటి కొత్త విచారణలు జరగకూడదు. కేసు విచారణ పూర్తయ్యేవరకూ జడ్జిని వేరే చోటుకు బదిలీ చేయకూడదు. విచారణను వాయిదా కూడా వేయకూడదు. ఒక వేళ కుదరని పక్షంలో మరుసటిరోజు లేదా వీలైనంత త్వరగా మళ్లీ విచారణను మొదలుపెట్టాలి. దీనికి గల కారణాలను రికార్డులో నమోదు చేయాలి అని సుప్రీం వ్యాఖ్యానించింది.

సురేంద్ర కుమార్ యాదవ్ కు తొలి పోస్టింగ్ ఫైజాబాద్‌ లో వచ్చింది. అదనపు జిల్లా జిడ్జిగా తొలి పదోన్నతి వచ్చింది కూడా ఆ జిల్లాలోనే. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో చివరి తీర్పు కూడా ఆయన అక్కడే ఇవ్వడం విశేషం. 28 ఏళ్ల నాటి ఈ క్రిమినల్ కేసుకు ప్రత్యేక జడ్జిగా నియమితుడైన సురేంద్ర కుమార్ యాదవ్ ‌కు ఫైజాబాద్‌ తో ప్రత్యేక అనుబంధముంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఏర్పాటుచేసిన లఖ్‌నవూలోని ప్రత్యేక కోర్టుకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన సెప్టెంబరు 30న తుది తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల క్రితం ఆగస్టు 5న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. 19 ఏప్రిల్ 2017లో ఈ కేసు విచారణను రెండేళ్లలోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.బీజేపీకి మార్గదర్శకులైన ఎల్‌కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి తదితర 32 మంది ప్రముఖులు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో బలమైన ఆధారాలు లేవని.. నిందితులందరూ నిర్దోషులని జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ ప్రకటించారు. మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని.. క్షణికావేశంలో జరిగిందని తీర్పు చెప్పారు.