Begin typing your search above and press return to search.

కోహినూర్ బ్రిటీషోడి దగ్గరకు ఎలా వెళ్లింది

By:  Tupaki Desk   |   20 April 2016 11:30 AM GMT
కోహినూర్ బ్రిటీషోడి దగ్గరకు ఎలా వెళ్లింది
X
కొన్నింటితో కొంతమందికి ఉండే అనుబంధం ఎంతో ఉంటుంది. భారతీయుల విషయానికి వస్తే.. కోహినూర్ తో వారికున్న అనుబంధం అంతాఇంతా కాదు. తమదైన ఈ అద్భుత వజ్రాన్ని కాలక్రమంలో తమ చేతుల్లో నుంచి చేజారిపోవటం.. బ్రిటీష్ రాణి కిరీటంలో ఒదిగిపోవటం తెలిసిందే. చరిత్రలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది.. సగర్వంగా స్వదేశానికి కోహినూర్ ను తీసుకురావాలన్నది సగటు భారతీయుడు ఆశ. కోహినూర్ తేవటంతోనే భారతదేశం కష్టాలు తీరుతాయా? లాంటి అనవసర వాదన కొందరు చేస్తుంటారు. కోహినూర్ తో దేశ ప్రజలకున్న అనుబంధంతో పోల్చినప్పుడు.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని పక్కన పెడితే.. సొంత వ్యక్తిత్వానికి ప్రతీకగా భావించే ఈ అమూల్య వజ్రం తిరిగి తమది చేసుకోవాలన్నది భారతీయుడి కల. మరి.. ఆ స్వప్నం సాకారం అవుతుందో లేదో కాలమే చెప్పాలి.

ఇంతకీ కోహినూర్ వజ్రం ఎక్కడ పుట్టింది? అదెన్ని చేతులు మారింది? చివరకు బ్రిటీషోడి చేతికి ఎలా చేరింది? నిజంగానే దాన్ని కానుకగా ఇచ్చారా? లేక.. కానుకగా ఇచ్చేలా చేశారా? లాంటి ప్రశ్నలు తాజాగా తెరపైకి వచ్చాయి. కోహినూర్ ను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్రం చేత చేయించాలంటూ సుప్రీంకోర్టులో వేసిన ఒక ప్రజాప్రయోజన పిటీషన్ పుణ్యమా అని ఈ అపురూప వజ్రం గురించి చర్చ మొదలైంది.

ఈ కేసు విచారణలో భాగంగా కోహినూర్ వజ్రం దొంగలించలేదని.. కానుక రూపంలో బ్రిటీష్ రాజకుటుంబానికి చేరిన నేపథ్యంలో తామేమీ చేయలేమంటూ సొలిసిటర్ జనరల్ చేసిన వ్యాఖ్యపై దేశ వ్యాప్తంగా దుమారం రేగటమే కాదు.. మోడీ సర్కారు మీద విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. ఈ విమర్శల ధాటికి వెనక్కి తగ్గిన కేంద్రం తన మాటను సరి చేసుకునే ప్రయత్నాల్ని మొదలెట్టింది. ఇంతకీ ఈ అపురూప వజ్రం బ్రిటీషోడి చేతికి ఎలా చేరిందన్న విషయాన్ని చూస్తే..

కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుజిల్లా కొల్లూరులో దొరికినట్లుగా కొందరు చెబుతుంటే.. మరికొందరు కృష్ణా జిల్లా పరిటాల దగ్గర లభించినట్లుగా చెబుతారు. తొలుత ఈ వజ్రాన్ని కాకతీయ రాజులు తమ దగ్గరు ఉంచుకొని కాపాడినట్లుగా తెలుస్తుంది. అనంతరం 1310లో మాలిక్ కాఫర్ కాకతీయ రాజ్యంపై దాడి చేసి సంపదంతా దోచుకుపోయారు. అలా దోచుకున్న సొత్తులో కోహినూర్ కూడా ఒకటి. ఇలా తెలుగు వారి చేతుల నుంచి బయటకు వెళ్లిన కోహినూర్ ఎక్కడా నిలకడ లేకుండా చేతులు మారుతూనే ఉంది.

ఖిల్లీల చేతికి చేరిన కోహినూర్ బాబర్ చేతికి వెళ్లింది. దాదాపు 200 ఏళ్ల పాటు మొఘల్ రాజుల చేతుల్లోనే ఈ వజ్రం ఉంది. పర్షియా రాజు నాదర్ షా మొఘల్ సామ్రాజ్యం మీద దాడి చేసి.. వారి సంపద అంతా దోచుకున్న సమయంలోనే కోహినూర్ నాదర్ షా చేతికి వెళ్లింది. నిజానికి.. ఈ అపురూప వజ్రానికి పేరు కోహినూర్ అన్న పేరు పెట్టింది నాదర్ షానే.

ఆ తర్వాత నాదర్ షా సైన్యాధికారి దురానీ చేతికి వెళ్లిన ఈ అపురూప వజ్రం.. తర్వాత రోజుల్లో సిక్కుల రాజు మహరాజా రంజిత్ సింగ్ వద్దకు వెళ్లింది. తర్వాత కాలంలో ఈ వజ్రాన్ని ఆయన పూరీ జగన్నాధ లయానికి దానంగా ఇవ్వాలని వీలునామా రాశారు. 1843లో రంజిత్ సింగ్ మరణించిన తర్వాత ఆయన కుమారుడు దలీప్ సింగ్ రాజుగా వ్యవహరించారు. అయితే..రాజ్యంలో ఏర్పడిన కల్లోల పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఈస్టిండియా కంపెనీ రంగ ప్రవేశం చేయటం.. అనంతరం రాజా దలీప్ సింగ్ ను బ్రిటన్ కు తీసుకెళ్లి బ్రిటన్ రాణికి కోహినూర్ ను బహుమతిగా ఇచ్చే ఏర్పాటు చేశారు. తన తండ్రి వీలునామాలో కోహినూర్ ను పూరీ జగన్నాథ ఆలయానికి బహుమానంగా ఇవ్వాలని రాసినా.. కొడుకు మాత్రం బ్రిటీష్ రాణికి గిఫ్ట్ గా ఇవ్వటం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఒత్తిడే అసలు కారణంగా అర్థమవుతుంది. అలా భరతభూమిని దాటిని కోహినూర్ నాటి నుంచి నేటి వరకూ తెల్లోడి దగ్గరే ఉండిపోయింది.