Begin typing your search above and press return to search.

శ్రీలంకకు కాబోయే కొత్త అధ్యక్షుడి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

By:  Tupaki Desk   |   14 July 2022 8:30 AM GMT
శ్రీలంకకు కాబోయే కొత్త అధ్యక్షుడి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
X
కాలానికి మించిన విచిత్రమైనది మరేమీ ఉండదు. ఈ భూ ప్రపంచంలో ఏదైనా సాధ్యమైనది ఒక్క కాలానికే. ఒకప్పుడు తప్పుగా కనిపించింది కాస్తా తర్వాతి కాలంలో ఒప్పుగా కనిపించటంలో కాలం కీ రోల్ పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. శ్రీలంక దేశ చరిత్రలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు కాలమహిమ ఇట్టే అర్థమవుతుంది. గొటబాయ రాజపక్సే ను గద్దె దింపేందుకు ప్రజలే రోడ్ల మీదకు రావటం.. వారి నిరసన తీవ్రతకు జడిసిన అతగాడు దేశం విడిచి పారిపోవటం తెలిసిందే. తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన రణిల్ విక్రమ సింఘే పైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. శ్రీలంక రాజకీయ సంక్షోభానికి పుల్ స్టాప్ పెట్టాలంటే నిరసనకారులు.. ప్రజలకు ఆమోదయోగ్యమైన నేత దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సి ఉంది.

ఇప్పుడా అవకాశం 55 ఏళ్ల సజిత్ ప్రేమదాసకు లభిస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇతగాడి కుటుంబ చరిత్రను చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే. ఆయన తండ్రి రణసింఘె ప్రేమదాస ఒకప్పుడు శ్రీలంక దేశాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన వ్యవహరించిన జాత్యహంకారాన్ని భరించలేక మైనార్టీ వర్గానికి చెందిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) ఆయన్ను దారుణంగా హత్య చేసింది. అలాంటిది ఇప్పుడు ఆయన కుమారుడ్ని దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అదే మైనార్టీ వర్గాలు కోరుకోవటం గమనార్హం.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. శ్రీలంకకు దేశాధ్యక్షుడయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న సజిత్ ప్రేమదాసకు అధ్యక్ష పదవి అన్నదే ఉండకూడదని కోరుకునే వ్యక్తి. అలాంటి ఆయనే.. ఇప్పుడు దేశాధ్యక్షుడు కానున్న వైనం చూస్తే.. విధి వైచిత్రి కాక మరేమిటి? అనుకోకుండా ఉండలేం. 2000 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన సజిత్.. ప్రస్తుతం కొలంబో జిల్లా నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. విపక్ష నేతగా సుపరిచితులైన ఆయన సమగి జన బలవేగయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

సజిత్ విషయానికి వస్తే.. అతనికి క్లీన్ చిట్ ఉంది. ఏ మరకా లేని నేతగా ఆయనకు మంచి పేరుంది. జాతి వివక్ష.. మైనార్టీలను వేరుగా చూడటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. సమ్మిళిత రాజకీయం ఉండాలన్నది ఆయన పాలసీ. మైనార్టీలను పరాయి వారిగా చూడటమే శ్రీలంక భద్రతకు పెను ముప్పు అన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదివిన సజిత్ చేతికి పాలనా పగ్గాలు వస్తే.. లంక ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరి.. అలా జరగటానికి అవకాశాల మాటేమిటి? అన్న విషయంలోకి వెళితే..

శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 సీట్లు ఉంటే.. అధికారాన్ని చేపట్టేందుకు113 మంది ఎంపీల బలం అవసరం. రాజపక్స సోదరుల యునైటెడ్ నేషనల్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ గా పోటీ చేశాయి. వీరు 145 స్థానాల్లో విజయం సాధించారు. తర్వాతి కాలంలో మరొకరు కూడా చేరారు. ఆ తర్వాత కూటమి నుంచి 43 మంది బయటకు వచ్చేసి స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సజిత్ ప్రేమదాస పార్టీకి 53 మంది ఎంపీలు ఉంటే.. తమిళ నేషనల్ అలయన్స్ కు 10 మంది ఎంపీలు.. సమతా విముక్తి పెరమునకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరికి 43 మంది ఉన్న స్వతంత్ర ఎంపీల కూటమి తోడైతే.. అధికారానికి అవసరమైన బలం చేకూరుతుంది. ఈ నెల 20న రహస్య బ్యాలెట్ పద్దతిలో అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. అందులో సజిత్ కు దేశాధ్యక్షుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.