Begin typing your search above and press return to search.

అప్పుడు జయ.. ఇప్పుడు పన్నీర్..?

By:  Tupaki Desk   |   9 Feb 2017 4:37 AM GMT
అప్పుడు జయ.. ఇప్పుడు పన్నీర్..?
X
చరిత్ర పునరావృతమవుతుందా? అన్నట్లుగా ఉంది తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల్ని చూస్తుంటే. సరిగ్గా 29 ఏళ్ల క్రితం అన్నాడీఎంకేలో ఎలాంటి పరిస్థితి నెలకొందో.. ఇంచుమించు అలాంటి పరిస్థితే నెలకొందన్న మాట వినిపిస్తోంది. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ కు బాసటగా నిలిచారు. అదే సమయంలో ఇప్పుడు అమ్మగా కీర్తిస్తున్న జయలలితను లైట్ తీసుకున్నారు. పార్టీ నేతల పట్టు తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజల్లో జయలలితకు పట్టు ఉండేది. అయినప్పటికీ జయను పార్టీలోకి రానిచ్చేవారు కాదు. చివరకు ఎంజీఆర్ అంతిమ యాత్ర సందర్భంగానూ ఆమెను తీవ్ర అవమానానికి గురి చేయటం మర్చిపోకూడదు.

గతాన్ని అక్కడితే వదిలితే.. వర్తమానంలో కూడా ఇలాంటి పరిస్థితే తమిళనాడులో కనిపిస్తోందని చెప్పాలి. నాడు ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకేలో వర్గ పోరు ఒక్కసారి ఉధృతమైంది. ప్రజల మద్దతు ఉన్న జయలలితకు పార్టీ నేతల నుంచి సహకారం లేకపోగా.. ఎంజీఆర్ సతీమణికి ప్రజల్లో కంటే పార్టీ నేతల్లో పట్టు ఉంది.

కాలక్రమంలో జయ పార్టీ మీద పూర్తి పట్టు సాధించటమే కాదు.. తనను తీవ్రంగా అవమానించిన జానకీ రామచంద్రన్ కు పార్టీలో నిలువ నీడలేకుండా చేశారని చెప్పాలి. తాజాగా అమ్మ మరణం సందర్భంగా అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న ప్రస్తుత పరిణామాలు గతాన్ని గుర్తు చేసేలా ఉన్నాయని చెప్పాలి. ప్రజాభిమానం మెండుగా ఉన్న పన్నీర్ కు పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేని విషయం నిన్న (బుధవారం) చోటు చేసుకున్న పరిణామంతో స్పష్టమైంది. ప్రజల్లో పట్టు లేని చిన్నమ్మ చెంతకు ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్లటం గమనిస్తే.. కాస్త అటూ ఇటూగా చరిత్ర పునరావృతమైందన్న భావన కలగటం ఖాయం. మరి జయ కాస్తా అమ్మగా మారిన చందంగా.. పన్నీర్ కూడా అదే బాటలో నడవనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగామారిందని చెప్పాలి. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల పట్టు ఉన్న చిన్నమ్మ చక్రం తిప్పుతారా? ప్రజాభిమానం భారీగా ఉన్న పన్నీర్ కు పవర్ చేతికి వస్తుందా? అన్న ప్రశ్నలకు కాలమే సరైన సమాధానం చెబుతుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/