Begin typing your search above and press return to search.

షాక్‌: ఎయిడ్స్ పుట్టిల్లుగా తెలంగాణ‌

By:  Tupaki Desk   |   30 Nov 2017 8:14 AM GMT
షాక్‌: ఎయిడ్స్ పుట్టిల్లుగా తెలంగాణ‌
X
మ‌నుషులను నిలువునా ముంచేసే మ‌హ‌మ్మారి ఎయిడ్స్.. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోందా? ముఖ్యంగా మూడున్న‌రేళ్ల కింద‌ట ఆవిర్భ‌వించిన కొత్త‌రాష్ట్రం తెలంగాణాను ఈ వ్యాధి అత‌లాకుతలం చేస్తోందా? దేశ చిత్ర‌పటంలో తెలంగాణ పరువును ఈ వ్యాధి నిలువునా తీసేస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. డిసెంబ‌రు 1(నేడు) ఎయిడ్స్ దినోత్స‌వం సంద‌ర్భంగా వెలుగులోకి వ‌చ్చిన గ‌ణాంకాలు.. తెలంగాణ‌ను ఈ వ్యాధి ప‌ట్టి పీడిస్తున్న తీరు వెల్ల‌డైంది. దీంతో యావ‌త్ తెలుగు ప్ర‌జానీకం నోరెళ్ల బెడుతోంది. అత్యంత భ‌యంక‌రమైన ఈ వ్యాధి ప‌ట్ల ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో ఈ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. నియంత్ర‌ణే త‌ప్ప నివార‌ణ‌లేని ఈ వ్యాధి.. భావి తెలంగాణానే కాదు - బంగారు తెలంగాణాను సైతం నిర్వీర్యం చేస్తోంద‌ని గ‌ణాంకాలు వివ‌రిస్తున్నాయి. ఈ మ‌హ‌మ్మారిపై వెలుగు చూసిన వివ‌రాలు ఇవీ..

తెలంగాణలో ఎయిడ్స్ వ్యాధి విస్తరిస్తోంద‌ని తాజాగా వెలుగు చూసిన అధ్య‌య‌నం వివ‌రిస్తోంది. గత ఆరు మాసాల వ్యవధిలోనే సుమారు 11,403 కొత్త ఎయిడ్స్ రోగులు నమోదయ్యారు. విచిత్రంగా.. దేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతున్నా - తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా బంగారు తెలంగాణ‌గా మారుస్తామ‌ని సీఎం కేసీఆర్ ప‌దే ప‌దే చెబుతున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి విస్తరిస్తోంద‌న్న ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ నివేదిక అంద‌రినీ తీవ్ర నిర్వేదంలో ముంచేసింది. ఈ సంస్థ‌ ఏప్రిల్‌-సెప్టెంబరులో జరిపిన సర్వేలో కొత్తగా 11,403 మందికి ఎయిడ్స్ వ్యాధి ఉందని తేలింది.

గత ఏడాదితో పోలిస్తే ఎయిడ్స్ రోగుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. ఈ ఏడాది ఆరు మాసాల్లోనే ఈ సంఖ్య పెరిగినట్టుగా సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఆరు మాసాల్లో 2,84,180 మందికి పరీక్షలు నిర్వహిస్తే 5,789 మందికి ఎయిడ్స్ ఉందని తేలింది. కొత్తగా పెరిగిన రోగుల సంఖ్య 2.04%. గత ఏడాది 5,87,738 మందికి హెచ్‌ ఐవీ పరీక్షలు నిర్వహించగా 11,403 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అంటే ఇది కేవ‌లం 1.94%. రెండు తెలుగు రాష్ట్రాలలో 9,521 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత సర్వేలో ఒక్క తెలంగాణలోనే కొత్తగా 5,789 కేసులు నమోదు కావడంతో తీవ్రత బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఇక‌, జిల్లాల విష‌యానికి వ‌స్తే.. మెదక్‌ - నల్గొండ - హైదరాబాద్‌ లలో ఎయిడ్స్‌ కేసుల తీవ్రత అధికంగా ఉంది. మెదక్‌ జిల్లాలో 19,335 మందిని పరీక్షించగా 574 మందికి - నల్గొండ జిల్లాలో 27,812 మందిని పరీక్షించగా 738 మందికి - హైదరాబాద్‌ లో 40,395 మందిని పరీక్షించగా 1024 మందికి ఎయిడ్స్ ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్లలో 4.32% - సంగారెడ్డిలో 4.05% - జగిత్యాలలో3.30% మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారని నివేదిక చాటి చెప్పింది. అదేస‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌న విష‌యం ఏంటంటే.. కొత్తగా ఎయిడ్స్‌ బారిన పడుతున్న వారిలో అత్యధికులు 40 ఏళ్లు దాటిన వారే ఉంటున్నట్టు తేల‌డం.

కాగా, గతంతో పోల్చుకుంటే తెలంగాణలో గర్బిణుల్లో ఎయిడ్స్‌ తగ్గుముఖం పట్టింద‌ట‌!.ఈ ఏడాది తెలంగాణలో 7,00,197 మంది గర్బిణులకు హెచ్‌ ఐవీ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా 3,21,674 మందికి పరీక్షలు నిర్వహించారు. 330 మంది హెచ్‌ఐవీ బారినపడినట్టు స్ప‌ష్ట‌మైంది. 0.10 మందికి ఈ ఏడాది కొత్తగా సోకింది. గర్భిణుల్లో అత్యధికంగా హెచ్‌ ఐవీ కేసులు రంగారెడ్డిలోనే నమోదయ్యాయ‌ట‌! అదేస‌మ‌యంలో 2016-17 లెక్కల ప్రకారం సెక్స్‌ వర్కర్స్‌ 56,086 మంది ఉండగా 12,417 మంది స్వలింగ సంపర్కులున్నారు. 1,015 మంది మత్తుమందు బానిసలు - 311 ట్రాన్స్‌ జెండర్స్‌ ఉన్నారు. వేశ్యా వృత్తిలో ఉన్నవారు నిత్యం హెచ్‌ ఐవీ పరీక్షలు చేసుకుంటున్నారు. కండోమ్స్‌ వాడితేనే సెక్స్‌ కు ఒప్పుకుంటున్నారు. ఫ‌లితంగా ఎయిడ్స్‌ తగ్గడానికి దోహ‌ద‌మైంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఏదేమైనా విశ్వ‌న‌గ‌రంగా చెప్పుకొంటున్న తెలంగాణ‌లో ఇలాంటి ప‌రిస్థితి విస్త‌రించ‌డం దారుణం అంటున్నారు విశ్లేష‌కులు.