Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ఏమైంది? మూసీ ఒడ్డున అంత రేటా?

By:  Tupaki Desk   |   15 Dec 2019 7:22 AM GMT
హైదరాబాద్ కు ఏమైంది? మూసీ ఒడ్డున అంత రేటా?
X
కేవలం 166 గజాలు. ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.27 కోట్లు. హైదరాబాద్ లోని సంపన్నులు ఉండే జూబ్లిహిల్స్ లోనో.. బంజారాహిల్స్ లోనో కాదంటే మణికొండలోనో.. ఇంకే ప్రైమ్ ఏరియాలో కాదు. ఆ మాటకు వస్తే.. అరకొర మౌలిక సదుపాయాలు ఉన్న చోట్ల కాదు. ఏకంగా మూసీ ఒడ్డున ఉన్న ప్రాంతంలో ఇంత ధర పలకటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చదరపు గజం రూ.77 వేలు చొప్పున కేవలం 166 చదరపు గజాల ఖాళీ స్థలానికి రూ.1.27కోట్లు పలికిన తీరు హైదరాబాద్ రియల్ రంగం ఎలా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. నగర శివారులో ఉండే ఉప్పల్ భగాయత్ లో తాజాగా హెచ్ ఎండీఏ ఈ- వేలాన్ని నిర్వహించింది. ఇందులో ఇంత భారీ ధర పలికింది. ఆర్నెల్ల క్రితం ఇదే ఉప్పల్ భగాయత్ లో వేసిన ఈ-వేలంలో గజం రూ.73,900 పలికింది. ప్రస్తుతం మాంద్యం ప్రభావం.. వివిధ కారణాలతో హైదరాబాద్ రియల్ రంగం స్తబ్దుగా ఉందన్న మాట వినిపిస్తున్న వేళ.. ఇంత భారీ ధర పలకటం రికార్డుగా చెబుతున్నారు.

ఈ వేలంలో అతి తక్కువగా చదరపు గజం రూ.30,200లకు కొనుగోలు చేస్తే అత్యధికంగా రూ.77వేల వరకూ వెళ్లటం గమనార్హం. మొత్తంగా ఈ వేలాన్ని చూసినప్పుడు సగటున చదరపు గజం రూ.53,520 పలికింది. తాజా వేలంలో 52 ఫ్లాట్లను అమ్మటం ద్వారా హెచ్ఎండీఏకు రూ.155 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంత ధర పలకటం వెనుక రియల్ కారణాలు వేరుగా ఉంటాయన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం నిర్వహించే వేలంలో చిన్న బిట్లను అత్యధిక రేట్లకు కొనుగోలు చేయటం ద్వారా.. ఆ చుట్టుపక్కల భూముల విలువను భారీగా పెంచే వ్యూహంగా దీన్ని అభివర్ణించేవాళ్లు లేకపోలేదు.

వేలానికి ముందే.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూములు ఉన్న వారు రంగంలోకి దిగి.. తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్ ను భారీ ధరకు కొనుగోలు చేయటం ద్వారా మీడియాలో ఆ ఏరియా భారీగా ఫోకస్ అయ్యేలా చేస్తుంటారు. అలా చేయటం ద్వారా.. ప్రభుత్వ వేలంలోనే భూమి ధర అంత భారీగా పెరిగినప్పుడు దగ్గర దగ్గర ఆ ధరకు తీసుకెళ్లటం కూడా ఒక వ్యూహమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. 166 గజాల ప్లాట్ కు పెట్టిన భారీ ధర ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసిందని చెప్పకతప్పదు.