Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లకు సెలవు.. క్రేజీవాల్ సంచలనం..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 2:30 PM GMT
ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లకు సెలవు.. క్రేజీవాల్ సంచలనం..!
X
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధానిలో నానాటికీ వాయు కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా శనివారం (రేపు) నుంచి ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలు మూసి వేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదు అవుతుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. గాలి నాణ్యత సూచీ 450 కంటే అత్యంత తీవ్ర స్థాయిలో నమోదు అవుతుందని కాలుష్య నియంత్రణ శాఖ వెల్లడించింది.. అత్యధికంగా బవానా ప్రాంతంలో 483 గా నమోదైనట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కారు పలు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులపై నిషేధం విధించారు. అయితే ఢిల్లీలో వాయి కాలుష్యానికి సరిహద్దు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను భారీగా తగులబెట్టడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

వాయు కాలుష్యం అనేది ఒక్క ఢిల్లీ సమస్యనే కాదన్నారు. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. గాలిలో నాణ్యత తగ్గడానికి ఢిల్లీనో.. పంజాబో కారణం కాదని స్పష్టం చేశారు. అయితే పంజాబ్ లోనూ తమ ప్రభుత్వం ఉందని అందువల్ల అక్కడి వ్యర్థాల దహనాలకు తాము బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

పంజాబ్ లో తమ ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలే అయిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ లోని ఇతర సమస్యలపై అక్కడి ప్రభుత్వం నిగమ్నమైందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంట వ్యర్థాలను తగుల బెట్టకుండా ఏం చేయాలనే దానిపై తాము కసరత్తు చేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

వచ్చే ఏడాది నవంబర్ లోగా ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం కనుక్కుంటామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో పెరిగిపోతున్న వాయి కాలుష్యం దృష్ట్యా రేపటి నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఐదు అంతకంటే పై తరగతుల విద్యార్థుల అవుట్ డోర్స్ గేమ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే వాహనాలకు సరి.. బేసి విధానాన్ని అమలు చేయడంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్.. కాలుష్య నివారణకు ఈ చర్య ఉపయోగపడుతుందన్నారు.దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు.

మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక వాయి కాలుష్య నగరాల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉండడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మున్ముందు మరిన్ని కఠిన చర్యలు ఢిల్లీలో తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.