Begin typing your search above and press return to search.

ఏపీలో రేపటి నుండి స్కూళ్లకి సెలవులు !

By:  Tupaki Desk   |   19 April 2021 10:47 AM GMT
ఏపీలో రేపటి నుండి స్కూళ్లకి సెలవులు !
X
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ లో నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్‌ సోమవారం అధికారులతో సమావేశం అయ్యారు. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో అనేక రాష్ట్రాలు విధిలేని పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలు మూసివేసి, పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నాయి. ఏపీలోనూ కరోనా ప్రమాద ఘంటికలు మోగుతుండడంతో సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యాసంస్థల కొనసాగింపు, పరీక్షల నిర్వహణ, కరోనా వ్యాప్తి నివారణ తదితర అంశాలపై సీఎం జగన్ వారితో చర్చించారు.

ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్ వెల్లడించారు. అయితే, రేపటి నుంచి 1 నుంచి 9 తరగతులకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. పాఠశాలల్లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జరిగే తరగతులను రద్దు చేసి అన్ని జిల్లా కేంద్రాల్లోని పాఠశాలల్లో శానిటైజేషన్ చేయిస్తున్నామన్నారు. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.