Begin typing your search above and press return to search.

ఏపీ హోం మంత్రికి ఘోర అవ‌మానం!

By:  Tupaki Desk   |   28 Dec 2017 5:34 PM GMT
ఏపీ హోం మంత్రికి ఘోర అవ‌మానం!
X
ప్ర‌భుత్వానికి సంబంధించి ఏదైనా పెద్ద కార్య‌క్ర‌మం - భ‌వ‌న శంకుస్థాప‌న జ‌రిగేట‌పుడు సంబంధిత శాఖ‌కు సంబంధించిన ముఖ్యుల‌ను పిల‌వ‌డం ఆన‌వాయితీ. వీవీఐపీ స్థాయి అతిథుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు అందించ‌డానికి కూడా దాదాపు అదే స్థాయి వ్య‌క్తులో - ఉన్న‌తాధికారులో వెళ్ల‌డం ఆన‌వాయితీ. అయితే - ఏపీలో ఇందుకు భిన్నంగా ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఏపీ డిప్యూటీ సీఎం - రాష్ట్ర హోం మంత్రి చినరాజప్పకు తీవ్ర అవమానం జరిగింది. నేడు జ‌రిగిన ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ శంకుస్థాపన కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా చిన‌రాజ‌ప్ప‌కు ఆహ్వాన పత్రాన్ని... ఓ కానిస్టేబుల్ చేత పోలీసు ఉన్నతాధికారులు పంపారు. దీంతో, నొచ్చుకున్న చిన రాజ‌ప్ప ఆ కార్య‌క్రమానికి హాజ‌రు కాలేదు.

ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌‌ కు గురువారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి చినరాజప్ప హాజరు కాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఆరా తీశారు. విజయవాడలో ఉన్నచిన రాజ‌ప్ప కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్ర‌శ్నించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. శంకుస్థాపన ఆహ్వానపత్రికను మొక్కుబడిగా కార్యాలయంలోని సిబ్బంది చేతికి ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదని, అందుకే చినరాజప్ప ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌కుండా తిరుమలకు వెళ్లార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో కూడా చాలా సార్లు ఇలాగే జ‌రిగింద‌ని, త‌న‌కు ఆహ్వానం అంద‌క‌పోయినా అనేక కార్యక్రమాల‌కు వెళ్లానని - సొంత శాఖలో ఇలా జ‌ర‌గ‌డం బాధించింద‌న చిన‌రాజ‌ప్ప స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లు తెలుస్తోంది. సదరు పోలీసు ఉన్నతాధికారులపై చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశార‌ని తెలుస్తోంది. ఫోన్‌ లో చిన‌రాజ‌ప్ప‌ను సీఎం బుజ్జగించే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. అయితే, ఈ ఘ‌ట‌న‌పై స్పందిండానికి హోంశాఖ అధికారులు - ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు నిరాకరించారు. సాక్షాత్తు మంత్రికే ఇలా జరగడంతో తమలాంటి చిన్న నేతల పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు . గురువారం సాయంత్రంలోపు చినరాజప్పతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం.