Begin typing your search above and press return to search.

ఎంత మహమూద్ అలీ అయితే మాత్రం అన్నేసిసార్లు హర్ట్ చేసుడా?

By:  Tupaki Desk   |   19 April 2022 4:22 AM GMT
ఎంత మహమూద్ అలీ అయితే మాత్రం అన్నేసిసార్లు హర్ట్ చేసుడా?
X
కాలం మారుతోంది. అందుకు తగ్గట్లే ప్రమాణాలు మారుతున్నాయి. మిగిలిన రంగాల్లో మారిన కాలానికి తగ్గట్లు గౌరవ మర్యాదలు ఉంటే.. అందుకు భిన్నంగా రాజకీయ రంగంలో మాత్రం పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే చాలు.. వారి హవానే వేరుగా ఉండేది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులకు సైతం విలువ లేని పరిస్థితి. గతంలో మంత్రులుగా ఉన్న వారి హవా ఏస్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి.

ఒకప్పుడు మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు.. మంత్రులకు ఉండే మర్యాద.. గౌరవం వేరుగా ఉండేది. ఇప్పుడు మంత్రులంటే పెద్దగా పట్టించుకోని పరిస్థితి. గతంలో మంత్రులకు ముఖ్యమంత్రుల వద్ద లభించే గౌరవ మర్యాదలు వేరుగా ఉండి కావు. వారు భేటీ కావాలని కోరినంతనే అపాయింట్ మెంట్ దొరికేది. వారు చెప్పే అంశాల్ని ప్రత్యేకంగా నోటో చేసుకోవటంతో పాటు.. నియోజకవర్గంలో జరుగుతున్న వివరాల్ని అడిగి తెలుసుకోవటంతో.. వారి ఆబ్లిగేషన్లు ఏమైనా ఉంటే పూర్తి చేస్తామని మాట ఇచ్చేవారు. తమకు లభించే ప్రాధాన్యతకు వారి దిల్ ఖుష్ అయిపోయేది.

అయితే.. ఇదంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో.

ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారో.. అప్పటి నుంచి మంత్రులతో భేటీ..సమావేశాలు కావటం చాలా తగ్గించేశారు. ఆ మాటకు వస్తే.. మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరగటం ఒక్క తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. గతంలో మంత్రుల హోదా ఒక స్థాయిలో ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి.

ఇదెంతవరకు వెళ్లిందనటానికి నిదర్శనంగా తెలంగాణలో హోం మంత్రి మహమూద్ అలీ గురించి చెప్పాలి. పేరుకు హోం మంత్రి అనే కానీ.. ఆయన ప్రమేయం లేకుండా ఆయన శాఖకు సంబంధించిన నిర్ణయాలు జరిగిపోతుంటాయి. మొన్నటికి మొన్న ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మజ్లిస్ కార్పొరేటర్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విటర్ ఖాతాకు జత చేసి చర్యలు తీసుకోవాలని నెటిజన్ అడగటం.. ఆ వెంటనే స్పందించిన కేటీఆర్ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి ఆదేశించటం తెలిసిందే.

సాధారణంగా ఇలాంటి అంశాల్ని హోం మంత్రికి చెప్పి.. ఆయన డీజీపీకి ఆదేశాలు జారీ చేయటం బాగుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా హోం మంత్రి ప్రమేయం లేకుండానే కేటీఆర్ నేరుగా డీజీపీకి ట్వీట్ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.

తాజాగా మంత్రి హరీశ్ రావు సైతం ఇదే తీరును ప్రదర్శించారు. త్వరలోనే పోలీసు కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి తీపి కబురు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి.. లేదంటే హోం శాఖా మంత్రి చెప్పటం బాగుంటుంది. అందుకు భిన్నంగా మంత్రి హరీశ్ పోలీసు కొలువల ప్రకటన చేసిన తీరు చూస్తే.. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిని బావ.. బావమరదులు ఇద్దరు పెద్దగా పట్టించుకోకుండా ఆయన శాఖకు సంబంధించిన అంశాల్ని సైతం వీరే డిసైడ్ చేయటం కనిపిస్తుందని చెప్పక తప్పదు.