Begin typing your search above and press return to search.

బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: తొలిసారి స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ

By:  Tupaki Desk   |   8 Jun 2022 10:52 AM GMT
బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: తొలిసారి స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ
X
తెలుగు నాట సంచలనం సృష్టించిన హైదరాబాద్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఓ ఎమ్మెల్యే కుమారుడు అంటూ.. ఓ మంత్రి మనవడు అంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే పోలీసులు మాత్రం ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ ను అరెస్ట్ చేయడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది.

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసుపై తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. పబ్ వ్యవహారంలో నా మనవడు ఉన్నాడని కొందరు అనవసర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అది నిజం కాదని తేలిందని.. పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని హితవు పలికారు.

వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగిందని చైర్మన్ తొలగింపు బోర్డు పరిధిలో ఉంటుందని తెలిపారు.హైదరాబాద్ రేప్ వ్యవహారంలో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుపై కేసు వేరు రాజకీయ సంబంధాలు వేరు అని గుర్తు పెట్టుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు.

ఇక ఈ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో బాధితురాలి వివరాలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారని ఆరోపిస్తూ న్యాయవాది కే.

కొమ్మిరెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మధ్య మండలం డీసీపీలకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెక్షన్ 228(ఏ) కింద కేసు నమోదు చేశామని.. ఇంతవరకూ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని సీఐ ప్రసాద్ రావు తెలిపారు.

మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కంచన్ బాగ్ ఠాణాలో కేసు నమోదైంది. అజ్మీర్ దర్గా ఔన్నత్యం, విశ్వాసాన్ని కించపరిచేలా రాజాసింగ్ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేశారని.. మతపరమైన అలజడులను సృష్టించేందుకు కుతంత్రాలు చేస్తున్నారంటూ కంచన్ బాగ్ ప్రాంత వ్యాపారి మహమూద్ అలీ ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయపరమైన సలహా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ ఉమామహేశ్వరరావు వెల్లడించారు.