Begin typing your search above and press return to search.

ఆ హోంమంత్రి దెబ్బకి మంగళసూత్రం యాడ్‌ ఉపసంహరణ..

By:  Tupaki Desk   |   1 Nov 2021 6:37 AM GMT
ఆ  హోంమంత్రి దెబ్బకి మంగళసూత్రం యాడ్‌ ఉపసంహరణ..
X
మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, హెచ్చరికల నేపథ్యంలో మంగళసూత్రం వాణిజ్య ప్రకటనను అసభ్యంగా చిత్రీకరించి విమర్శలు పాలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ ఆ ప్రకటనను ఉపసంహరించుకోవడానికి ముందుకి వచ్చారు. విమర్శలు వెల్లువెత్తిన ఈ ప్రకటనలో ఒంటరిగా ఉన్న మహిళలు కొందరు మంగళసూత్రంతో కనిపించగా, మరికొంతమంది అసభ్యంగా ఉన్న సమయంలో మంగళసూత్రం ధరించినట్టుగా ఉంది. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు మంగళసూత్రం పవిత్రతను దెబ్బతీశారంటూ సవ్యసాచిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మరోవైపు, ఈ యాడ్‌పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లోగా ఈ ప్రకటనను ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, పోలీసు బలగాలను కూడా పంపిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఓ వైపు ట్రోలింగ్, మరోవైపు మంత్రి అల్టిమేటంతో దిగొచ్చిన సవ్యసాచి ముఖర్జీ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. వారసత్వం, సంస్కృతిని కలగలిపి యాడ్‌ ను చిత్రీకరించామని, కానీ ఈ ప్రకటన సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందన్న ఆరోపణలు తమను కూడా బాధించాయని, అందుకనే యాడ్‌ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సవ్యసాచి కంపెనీ వెల్లడించింది.

అసలు ఆ ప్రకటన లో ఏం చూపించారంటే ... ఆ ప్రకటనలో కొంతమంది ఒంటరిగా ఉన్న మహిళలు మంగళసూత్రం ధరించారు. మరో దాంట్లో ఓ వ్యక్తితో శృంగార భంగిమల్లో అర్ధనగ్నంగా ఉన్న మహిళ మంగళసూత్రం ధరించింది. సవ్యసాచి ఈ ఫొటోలను షేర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రకటన హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని దుమ్మెత్తి పోశారు. గతవారంలో ఇలాంటి ప్రకటనే ఒకటి విమర్శలకు కారణమైంది. దాబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఫెమ్ క్రీమ్ బ్లీచ్ ప్రకటనపైనా విమర్శలు వెల్లువెత్తాయి.