Begin typing your search above and press return to search.

మాజీ పోలీస్ బాస్ లేఖతో దుమారం..హోంమంత్రి రాజీనామా?

By:  Tupaki Desk   |   21 March 2021 12:30 PM GMT
మాజీ పోలీస్ బాస్ లేఖతో దుమారం..హోంమంత్రి రాజీనామా?
X
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులతో కూడిన వాహనం కేసు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేసేలా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ కేసు విషయమై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ మాజీ బాస్ స్వయంగా మహారాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేయడంతో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ముంబై నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి నెలకు 100 కోట్ల వసూలు చేయాలని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారంటూ మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ తాజాగా సీఎం ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించారు. ఈ లేఖ ముంబై పోలీస్ శాఖలో పెద్ద దుమారం రేపింది. వాజేకి అనిల్ టార్గెట్ నిర్ధేశించారని ఆరోపించారు.

దీంతో ప్రతిపక్ష బీజేపీ ఇతర నేతలు హోంమంత్రి రాజీనామా చేయాలంటూ ఆదివారం నిరసనకు దిగారు. హోంమంత్రి రాజీనామా చేయాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అంబానీ నివాసం వద్ద బాంబు ఉంచిన వాహనం కేసు నుంచే ఈ వివాదం మొదలు కావడంతో ఈ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పార్టీ సీనియర్ మంత్రులను ఢిల్లీకి పిలిపించారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా హాజరు కానున్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం సాయంత్రం శరద్ పవార్ తో భేటి కానున్నారు. దీంతో మహారాష్ట్ర హోంమంత్రిని రాజీనామా చేయడమా? సస్పెండ్ చేసే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. ఆయనను పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం సాగుతోంది.