Begin typing your search above and press return to search.

సీఎంలు అలా చేయ‌నే చేయొద్ద‌ని చెప్పారు

By:  Tupaki Desk   |   1 Jan 2018 5:19 AM GMT
సీఎంలు అలా చేయ‌నే చేయొద్ద‌ని చెప్పారు
X
దేశంలోని ముఖ్య‌మంత్రుల‌కు ఆస‌క్తిక‌ర నోటీసును జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌. ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కూడా వేరే రాష్ట్రానికి వెళ్లే ముందు.. త‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి స‌మాచారం ఇవ్వ‌కుండా వెళ్లొద్ద‌ని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటీసును అన్ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌కుల‌కు కేంద్రం పంపింది.

ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా వేరే రాష్ట్రాల‌కు వెళ్ల‌టం ద్వారా భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని.. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పేందుకే తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది. భ‌ద్ర‌తా ప‌ర‌మైన స‌మ‌స్యే కాదు.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి అక‌స్మాత్తుగా వేరే రాష్ట్రానికి వెళ్ల‌టం వ‌ల్ల అక్క‌డ అధికారులు కొద్దిగా ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంద‌ని హోంశాఖ పేర్కొంది. తాజాగా జారీ చేసిన నోటీసుతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇబ్బంది ప‌డ‌టం ఖాయమంటున్నారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. కోడ‌లు.. మ‌న‌మ‌డు అంద‌రూ హైద‌రాబాద్‌లోనే ఉన్నారు. దీంతో.. కుటుంబం కోసం ఆయ‌న త‌ర‌చూ (మిగిలిన ముఖ్య‌మంత్రులతో పోల్చిన‌ప్పుడు) హైద‌రాబాద్ వ‌స్తుండే విష‌యం తెలిసిందే. తాజాగా కేంద్ర హెంమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసు ప్ర‌కారం చూస్తే.. త‌న ప‌ర్య‌ట‌న‌కు ముందు రాష్ట్ర ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శికి ప‌క్కా స‌మాచారం అందించి.. త‌న షెడ్యూల్ ను చెప్పిన త‌ర్వాతే హైద‌రాబాద్‌కు రావాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే ఈ విధానాన్ని చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న‌ట్లు చెబుతారు. కొన్ని సంద‌ర్భాల్లో కొంత‌మేర స‌మాచారం మాత్ర‌మే ఇచ్చేశారు. ఇక‌పై.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల నేప‌థ్యంలో త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల్ని తాను ప‌ర్య‌టించే రాష్ట్ర స‌ర్కారుతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం తెలంగాణ రాష్ట్ర ప‌రిధిలో ఉండ‌టంతో.. బాబు త‌న హైద‌రాబాద్ విజిట్ గురించి మొద‌ట కేసీఆర్‌కే చెప్పాల్సి ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌కీ ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి కేంద్రం చెబుతున్న కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు జెడ్ లేదా జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉంటుంద‌ని.. వేరే రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు అతిథ్య‌మిచ్చే రాష్ట్రం వ‌చ్చిన సీఎంకు ఒక్కోసారి స‌రైన స‌దుపాయాలు క‌ల్పించ‌లేక‌పోవ‌చ్చ‌ని.. అందుకే ముందుగా స‌మాచారం ఇస్తే స‌ద‌రు సీఎంకు అవ‌స‌ర‌మైన రీతిలో ఏర్పాట్లు చేసే వీలుంటుంద‌ని చెబుతున్నారు. అతిధ్యం మాట ప‌క్క‌న పెడితే.. త‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన అన్ని వివ‌రాలు స‌ద‌రు రాష్ట్రానికి తెలీటం ఖాయం. ఇది.. బాబు.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ లాంటోళ్ల‌కు ఇబ్బంది క‌లిగించే ఆదేశంగా అభివ‌ర్ణిస్తున్నారు.