Begin typing your search above and press return to search.

ఈ జంట‌..భార‌త్‌ - అమెరికా చ‌రిత్ర తిర‌గ‌రాశారు

By:  Tupaki Desk   |   9 Jun 2018 6:19 PM GMT
ఈ జంట‌..భార‌త్‌ - అమెరికా చ‌రిత్ర తిర‌గ‌రాశారు
X
భార్య‌భ‌ర్త‌లంటే ఎలా ఉంటారు? అన్యోన్యంగా - క‌లిసిమెల‌సి ఉంటార‌నే విష‌యం తెలిసిందే. అయితే, ఇటీవ‌లి కాలంలో ఇద్ద‌రూ ఉద్యోగాలు చేయ‌డం స‌హా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌లిసి గ‌డిపే స‌మ‌యం త‌గ్గిపోతోంది. అలా స‌మ‌యం త‌గ్గిపోయి 37 ఏళ్ల వైవాహిక జీవితాన్ని గ‌డిపేసిన ఓ జంట‌..సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకుంది. ఏకంగా అమెరికా-భార‌త్ చరిత్ర‌లోనే...ఎవ‌రూ చేయ‌ని ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టి విజ‌యం సాధించింది. ఇంత‌కీ రెండు దేశాల ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోయేలా చేసిన ఆ రికార్డ్ ఏంటంటే...అమెరికాలో కాలిఫోర్నియాలోని త‌మ ఇంటి నుంచి హైదరాబాద్‌ లోని ఇంటి వరకూ కారులో ప్రయాణించాలని నిర్ణయించ‌డం!ఈ సంచ‌ల‌న‌ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టిన దంప‌తులు మ‌రో రెండ్రోజుల్లో భాగ్య‌న‌గ‌రానికి చేరుకోనున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన ఈ జంట గురించిన వివ‌రాల్లోకి వెళితే...హైదరాబాద్‌ కు చెందిన డా. రాజేశ్‌ కడాకియాకు సికింద్రాబాద్‌ కు చెందిన డా. దర్శనతో వివాహం జ‌రిగింది.వివాహం జరిగిన తర్వాత రాజేశ్‌ - దర్శన్‌ లు డాక్టర్లుగా బిజీబిజీ జీవితంలో నిమగ్నమైపోయారు. వృత్తి రీత్యా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అయితే, బిజీ వ‌ల్ల‌...కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. ఇలా వారి 37 ఏళ్ల వైవాహిక జీవితం వైద్యవృత్తికే అంకితం అయింది. డాక్టర్లుగా ఉన్నత శిఖరాలను చేరుకున్నప్ప‌టికీ...వ్యక్తిగత జీవితాన్ని మిస్సవుతున్నామనే ఆలోచన వారిని మెదడుని తొలిచేది. అందుకు ఓ ప‌రిష్కారం ఆలోచించారు. అదే...అమెరికా నుంచి త‌మ సొంత ఊరికి కారులో ప్ర‌యాణించ‌డం. ఆరు పదుల వయసులో 'హోమ్‌ రన్‌' పేరుతో కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్ బ‌య‌ల్దేరేందుకు ఈ ఏడాది మార్చి 28న ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. `టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్’ డీజిల్‌ కారును అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది యాత్రకు ప్రారంభించారు.

కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌ లోని స్వామి ముక్తానంద ఆశ్రమానికి వెళ్లి దైవ ద‌ర్శ‌నం అనంత‌రం త‌మ ప్ర‌యాణం మొద‌లుపెట్టారు ఈ దంప‌తులు. న్యూయార్క్ నుంచి విమానంలో కారును పారిస్‌ కు పంపి ఏప్రిల్‌ 12న పారిస్‌లో కారును తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. అమెరికా-ఫ్రాన్స్‌- బెల్జియం-జర్మనీ-డెన్మార్క్‌- నెదర్లాండ్‌- స్వీడన్‌- ఫిన్‌లాండ్‌-రష్యా- కజకిస్తాన్ అనంత‌రం మ‌ళ్లీ రష్యా - మంగోలియా - చైనా - టిబెట్‌ - నేపాల్‌ ల మీదుగా రోడ్డు మార్గంలో భారత్‌కు చేరుకున్నారు. ఇలా 37 వేల కిలోమీటర్లు ప్రయాణించి జూన్‌ 12న హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సంచ‌ల‌న యాత్ర‌పై రాజేష్ స్పందిస్తూ...మ‌నిషి త‌లుచుకుంటే..సాధించ‌లేనిది ఏదీ లేద‌ని నిరూపించేందుకే తాము ఈ ప్ర‌యాణం మొద‌లుపెట్టామ‌ని తెలిపారు. ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం ప్రయాణించాల్సి ఉంటుందని, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొవాల్సివుంటుందనే విష‌యం త‌న‌కు తెలుసున‌ని, త‌న భార్య ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ యాత్ర‌ను విజ‌యంవంతంగా పూర్తి చేసుకోబోతున్నామ‌ని ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న వెల్ల‌డించారు.