Begin typing your search above and press return to search.

మీకు తెలుసా.. ప్రపంచంలో ఖరీదైన నగరం ఇదే!

By:  Tupaki Desk   |   19 Nov 2020 10:30 AM GMT
మీకు తెలుసా.. ప్రపంచంలో ఖరీదైన నగరం ఇదే!
X
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు ఎంతో ఖరీదైనవి ఉంటాయి. మరికొన్ని నగరాల్లో జీవనప్రమాణాలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఖరీదైన నగరాల్లో ఓ మనిషి జీవించేందుకు భారీగా ఖర్చవుతుంది. అన్నిటికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సాధారణ నగరాల్లో ఆ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రపంచంలోని 130 నగరాల్లో అధ్యయనం చేసింది. 130 వస్తువుల జాబితాలను రూపొందించి ఏ నగరంలో వాటి విలువ ఎంత ? అనే అంశంపై సర్వే నిర్వహించింది.

వీటి సగటు ఆధారంగా ప్రపంచంలో ఖరీదైన నగరాలేవి.. చవకైన నగరాలేవి? అనే విషయంపై ఓ అంచనాకు వచ్చింది. ఆ సర్వే ప్రకారం హాంకాంగ్, పారిస్, జూరిచ్‌ అత్యంత ఖరీదైన నగరాలుగా నిర్ధారించారు. అంతకంటే కొంచెం తక్కువ ఖరీదైన నగరాలు సింగపూర్, ఒసాకా, టెల్‌ అవీవ్, న్యూయార్క్‌ నిలిచాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశం సిరియా రాజధాని డమస్కస్‌. ఆ తర్వాత ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కంట్, లుసాకా, కారకాస్, ఆల్మటీ నగరాలు. ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది.

అమెరికా డాలర్‌పై యూరో స్విస్‌ ఫ్రాంక్‌ల విలువ పెరగడంతో అత్యంత ఖరీదైన నగరాల్లో ఐదవ స్థానంలో ఉన్న పారిస్, జూరిచ్‌ అగ్రభాగానికి చేరుకున్నాయి. కరోనా ప్రభావం వల్ల రెండు ఆసియా దేశాల్లో నిత్యావసర సరుకుల ధరలు పడిపోయాయి. అలా నాలుగో స్థానంలో ఉన్న సింగపూర్, ఒసాకా ఐదవ స్థానానికి పడి పోయాయి. విదేశీ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లడంతో సింగపూర్​లో ధరలు పడిపోయాయి.