Begin typing your search above and press return to search.

`కాలా`పార్టీలో 'కాషాయం' ఉంటే క‌లవ‌ను: క‌మ‌ల్

By:  Tupaki Desk   |   11 Feb 2018 10:03 AM GMT
`కాలా`పార్టీలో కాషాయం ఉంటే క‌లవ‌ను: క‌మ‌ల్
X
ఓ ప‌క్క క‌మ‌ల్ హాస‌న్....మ‌రోప‌క్క ర‌జ‌నీకాంత్.....వీరిద్ద‌రి రాజ‌కీయ అరంగేట్రంతో త‌మిళ‌నాట రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. త‌మ పార్టీ గుర్తు, విధివిధానాలు, పేరు...ఇత‌ర‌త్రా విష‌యాల‌ను వీరిద్ద‌రూ వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌పై ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. వామ‌ప‌క్ష భావజాలానికి ద‌గ్గ‌ర‌గా క‌మ‌ల్.....బీజేపీకి ద‌గ్గ‌ర‌గా ర‌జ‌నీ ఉన్నార‌ని టాక్ వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో వీరిద్ద‌రూ క‌లిసి పోటీ చేస్తారా....లేదా అన్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. తాను క‌మ‌ల్ తో ప‌నిచేస్తానా ...లేదా...అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధాన‌మిస్తుంద‌ని ర‌జనీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాదాపుగా ఇదే త‌ర‌హా స‌మాధానాన్ని క‌మ‌ల్ కూడా చెప్పారు. ఈ విష‌యంపై విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ర‌జ‌నీకాంత్ పార్టీలో `కాషాయ‌` రంగు ఉన్న ప‌క్షంలో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసే ప్ర‌స‌క్తే లేద‌ని క‌మ‌ల్ తేల్చి చెప్పారు. అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ప్ర‌సంగించిన క‌మ‌ల్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

వాక్ స్వాతంత్ర్య‌పు హ‌క్కుపై ప్ర‌భుత్వాలు ఉక్కుపాదం మోప‌డం స‌రికాద‌ని, ప్ర‌జాస్వామ్యానికి వాక్ స్వాతంత్ర్య‌పు హ‌క్కు పునాది వంటిద‌ని, అందులో ప్ర‌తి ఒక్క‌రికీ మాట్లాడే హ‌క్కు ఉంటుంద‌ని చెప్పారు. దానిని ప‌రిర‌క్షించిన‌పుడే భావిత‌రాల వారికి మంచి భ‌విష్య‌త్తును అందించ‌గ‌లుగుతామ‌న్నారు. అవినీతి ర‌హిత త‌మిళ‌నాడును సాధించ‌డమే త‌న ల‌క్ష్య‌మ‌ని, అందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని అన్నారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని క‌మ‌ల్ అన్నారు. ర‌జ‌నీకాంత్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని, సినిమాలు , రాజ‌కీయాలు వేరువేర‌ని క‌మ‌ల్ అన్నారు. తన రాజ‌కీయ పార్టీ గుర్తులో `ఎరుపు`లేద‌ని, అదే స‌మ‌యంలో ర‌జ‌నీ పార్టీ గుర్తులో `కాషాయం` ఉన్న ప‌క్షంలో ఆయ‌నకు మ‌ద్ద‌తివ్వ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న స‌మ‌కాలీన హీరోల‌తో పోలిస్తే త‌న సినిమాలు విభిన్నంగా ఉంటాయ‌ని, అదే త‌ర‌హాలో త‌న రాజ‌కీయాలు కూడా విభిన్నంగా ఉంటాయ‌న్నారు.

కాగా, ఫిబ్రవరి 21వ తేదీన త‌న రాజకీయ పార్టీ పేరు - విధివిధానాలు - కార్య‌చ‌ర‌ణ వెల్ల‌డించ‌బోతున్నాన‌ని క‌మ‌ల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని తన అభిమానులకు క‌మ‌ల్ పిలుపునిచ్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని, వారితో చ‌ర్చించి వారి అభిప్రాయాల‌ను తెలుసుకోవ‌డానికే ఫిబ్ర‌వ‌రి 21 నుంచి ``న‌లాయి న‌మ‌దే``(రేపు మ‌నదే) పేరుతో ప్ర‌జాయాత్ర చేప‌డుతున్నాన‌ని క‌మ‌ల్ చెప్పారు. రామనాథపురంలో ఉన్న దివంగత మాజీ రాష్ట్రపతి - మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి త‌న యాత్ర ను క‌మ‌ల్ ప్రారంభించ‌బోతున్నారు. ఈ యాత్ర‌ను `జ‌ర్నీ ఆఫ్ డిస్క‌వ‌రీ` గా క‌మ‌ల్ అభివ‌ర్ణించారు. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను వెలికితీసేందుకు ఈ ప్ర‌యాణం చేప‌డుతున్నాన‌ని క‌మ‌ల్ అన్నారు.