Begin typing your search above and press return to search.

సీఎం కోడలి ప్రసవానికి హాస్పిటల్ ఖాళీ చేయించారు

By:  Tupaki Desk   |   16 Nov 2017 3:36 PM GMT
సీఎం కోడలి ప్రసవానికి హాస్పిటల్ ఖాళీ చేయించారు
X
ఈమధ్య కాలంలో నేతలు రాజకీయ మైలేజి కోసం ప్రభుత్వాసుపత్రులకు వెళ్తుండడం తరచూ కనిపిస్తోంది. అయితే... ఆ సందర్భంగా వారు చేసే హడావుడికి సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన కోడలిని కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్లడం వరకు బాగానే ఉంది. కానీ.. అందుకోసం ఆమె చేరిన వార్డు ఉన్న ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయించి అక్కడ అప్పటికే ఉన్న రోగులను ఇబ్బంది పెట్టడమే వివాదాస్పదమైంది.

రాయ్‌పూర్‌లోని భీంరావ్ అంబేద్క‌ర్ మెమోరియ‌ల్ ప్రభుత్వాసుప‌త్రిలో ర‌మ‌ణ్ సింగ్ కోడ‌లు ఐశ్వ‌ర్యాసింగ్‌ను ప్ర‌స‌వం నిమిత్తం చేర్చారు. దీంతో ముఖ్య‌మంత్రి కుటుంబం కోసం ఆ అంత‌స్తులో ఉండే పేషెంట్లంద‌రినీ ఆసుప‌త్రి వ‌ర్గాలు మ‌రో అంత‌స్తుకి త‌ర‌లించాయి. దాదాపు 1200 మంది రోగులను ఖాళీ చేయించాయి. అలా తరలించిన చోట సరిపడినన్ని పడకలు లేకపోవడంతో ఒకే బెడ్ మీద ఇద్ద‌రు పేషెంట్లు సర్దుకోవాల్సి వచ్చింది. దీంతో పేషెంట్లు చాలా ఇబ్బంది ప‌డ్డారు.

కాగా ఈ ఘటనపై అక్కడి ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే ఛత్తీస్ గఢ్ బీజేపీ నేతలు మాత్రం విచిత్రమైన వాదన చేస్తున్నారు. సీఎం కోడలు ప్రభుత్వాసుపత్రికి రావడమే గొప్ప గౌరవమని.. అలాంటప్పుడు ఇదంతా పట్టించుకోకూడదన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం రమణ్ సింగ్‌ను, బీజేపీని, ఆసుపత్రి వర్గాలను ఏకిపడేస్తున్నారు. కోడలి కోసం 1200 మందిని ఇబ్బంది పెట్టడం న్యాయమా అని ప్రశ్నిస్తూ మండిపడుతున్నారు.