Begin typing your search above and press return to search.

ఇక పై ఆ ఇంజెక్షన్లు తెచ్చే భాద్యత ఆస్పత్రులదే.. ఏవంటే !

By:  Tupaki Desk   |   30 May 2021 1:30 AM GMT
ఇక పై ఆ ఇంజెక్షన్లు తెచ్చే భాద్యత ఆస్పత్రులదే.. ఏవంటే !
X
దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటుగా , బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతూన్నాయి. అయితే , బ్లాక్ ఫంగస్ బాధితుల కుటుంబ సభ్యులకి కూడా తిప్పలు తప్పడంలేదు. యాంఫోటెరిసిన్‌ కోసం కుటుంబ సభ్యులు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. అయితే ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు యాంఫోటెరిసిన్‌ తిప్పలు తప్పనున్నాయి. స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఇంజక్షన్లు తీసుకొచ్చే బాధ్యతను ఇక నుంచి ఆస్పత్రులే తీసుకోనున్నాయి. దీన్ని సమన్వయం చేసేందుకు ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులతో వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం భేటీ నిర్వహించింది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో 364మంది బ్లాక్‌ఫంగస్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. వారికి యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్లు కావాలంటే, రోగి వివరాలను ఆయా ఆస్పత్రు లు వైద్య, ఆరోగ్యశాఖకు మెయిల్‌ చేయాలి. అక్కడి నుంచి అనుమతి లభించాక ఫలానా స్టాకిస్టు వద్ద నుంచి తీసుకురావాలని చెబుతూ రోగుల బంధువులకు ప్రైవేట్‌ ఆస్పత్రులు లేఖలు ఇస్తున్నాయి. దాంతో రోగుల బంధువులు ఆస్పత్రి ఇచ్చిన లేఖను పట్టుకొని ఔషధ స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ తిరుగుతున్నారు.

దీనిపై వైద్య, ఆరోగ్యశాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్ల కేటాయింపును సమన్వయం చేసేందుకు కోఠి ఈఎన్‌ టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రతి రోజూ రోగుల వివరాలను వైద్య, ఆరోగ్యశాఖకు పంపాల్సి ఉంటుంది. అలాగే, కొత్తగా చేరే రోగుల వివరాలను కూడా అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్లను వైద్య ఆరోగ్యశాఖ కేటాయిస్తుంది. ఇదంతా ప్రభుత్వం నియమించిన కమిటీ పర్యవేక్షిస్తుంది.అయితే, ఈ ఔషధ ధరలను రోగులే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారికి మాత్రం యాంఫోటెరిసిన్‌ ఉచితంగానే ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 774 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతి రోజూ 3500 వయల్స్‌ను మాత్రమే కేంద్రం కేటాయిస్తోందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చే కోటా.. రోగులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో రోగికి ఎన్ని ఇంజక్షన్లు అవసరం ఉన్నా.. కేవలం ఐదు మాత్రమే అధికారులు కేటాయిస్తున్నారు.