Begin typing your search above and press return to search.

ఇలా అయితే ఏజీ కి కూడా స‌ల‌హాదారుల‌ను నియ‌మిస్తారు: హైకోర్టు హాట్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   24 Aug 2022 2:30 PM GMT
ఇలా అయితే ఏజీ కి కూడా స‌ల‌హాదారుల‌ను నియ‌మిస్తారు: హైకోర్టు హాట్ కామెంట్స్‌!
X
ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేవాదాయ శాఖ‌కు స‌ల‌హాదారుకు రాష్ట్ర బ్రాహ్మ‌ణ స‌మాఖ్య అధ్య‌క్షుడు జె.శ్రీకాంత్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ నియామ‌కంపై రాష్ట్ర హైకోర్టు తాజాగా స్టే విధించింది.

శాఖ‌ల‌కు స‌ల‌హాదారులేంటి? అని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. స‌ల‌హాదారులు రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని హైకోర్టు మండిప‌డింది. ఇలాగే వ‌దిలేస్తే రేపు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌కు కూడా స‌ల‌హాదారును నియ‌మిస్తార‌ని వ్యాఖ్యానించింది.

స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకునేందుకు ప్ర‌భుత్వానికి అధికారుల కొర‌త ఉందా అని హైకోర్టు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. మంత్రులకు సలహాదారులంటే అర్థం ఉంటుంది.. శాఖలకి సలహాదారులేంటి?'' అని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించింది.

ఏపీ దేవాదాయశాఖకు సలహాదారుగా జె.శ్రీకాంత్‌ నియామకంపై స్టే విధించింది. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్‌ను ఏపీ ప్రభుత్వం నియమించిన సమయంలోనే పలు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. అయితే ఆ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఏపీలో ప్ర‌భుత్వానికి అత్యంత ముఖ్యుడైన‌ ఒక గురువు ఆదేశాల మేర‌కు శ్రీకాంత్‌ను నియ‌మించార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో శ్రీకాంత్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం పిటిషన్‌ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయ‌మూర్తి జస్టిస్‌ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.