Begin typing your search above and press return to search.

ఈట‌ల‌పై త్రిముఖ వ్యూహంతో కేసీఆర్ ఫైట్‌.. హుజూరాబాద్‌పై ప్లాన్ ఇదే!

By:  Tupaki Desk   |   8 July 2021 12:30 AM GMT
ఈట‌ల‌పై త్రిముఖ వ్యూహంతో కేసీఆర్ ఫైట్‌.. హుజూరాబాద్‌పై ప్లాన్ ఇదే!
X
తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌.. కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కావ‌డం.. అనంత‌రం.. చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న పార్టీకి రిజైన్ చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా వ‌దులుకుని.. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక రానుంది. ఈ నేప‌థ్యం లో అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? ఏ విధంగా ముందుకు సాగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌తి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించే కేసీఆర్‌.. ఈట‌ల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

త్రిముఖ వ్యూహం

త్వ‌ర‌లోనే జ‌గ‌ర‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో మూడు ల‌క్ష్యాలు పెట్టుకుని.. వాటిని సాధించే దిశ‌గా.. కేసీఆర్ అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఒక‌టి ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈట‌లను ఓడించ‌డం. రెండు భారీ మెజారిటీ ద‌క్కించుకుని.. టీఆర్ ఎస్‌కు తిరుగులేద‌నే సంకేతాలు పంపడం. మూడు.. పార్టీపై మ‌రింత ప‌ట్టు పెంచుకోవ‌డం. ఈ మూడు అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని హుజూరాబాద్ ఎన్నిక విష‌యంలో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈట‌ల ప‌రిస్థితి చూస్తే.. తెలంగాణ ఉద్య‌మంతో మ‌మేక‌మైన చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయ‌న‌కు దీటైన అభ్య‌ర్థిని నిల‌బెడితే.. త‌ప్ప‌.. విజ‌యం అంత ఈజీకాద‌నేది కేసీఆర్‌కు తెలియంది కాదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

క్యూలో చాలా మందే!!

ప్ర‌స్తుతం హుజూరాబాద్ టికెట్ కోసం అధికార పార్టీలో చాలా మంది లైన్‌లో ఉన్నారు. అయితే.. వీరు కాకుండా.. పార్టీ అధినేత కేసీఆర్ ఇంకా అనేక మంది ప్రొఫైళ్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. వీరిలో.. ప్లానింగ్ బోర్డు స్టేట్ వైస్ చైర్మ‌న్ బోయిన‌ప‌ల్లి వినోద్, రిటైర్డ్ ఐఏఎస్ ముద్ద‌సాని పురుషోత్తం రెడ్డి, క‌శ్య‌ప్ రెడ్డి, ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, క‌నుమ‌ల్ల విజ‌య, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి, ముద్ద‌సాని మాలతితో పాటు.. మ‌రికొంద‌రి పేర్ల‌ను కేసీఆర్ ప‌రిశీలిస్తున్నారు.

కెప్టెన్ అయితే..

అయితే.. వీరంద‌రిలోకీ.. కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు వైపు కేసీఆర్ మొగ్గుచూపుతున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి క‌డియం శ్రీహ‌రి పేరు కూడా వినిపిస్తున్నా.. ఆయ‌నపై కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని.. అంటున్నారు. ఈ క్ర‌మంలో క‌ప్టెన్ వైపు కేసీఆర్ మొగ్గు చూపే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈయ‌న‌కు ఉద్య‌మ నేప‌థ్యంతో పాటు.. మేధావుల్లో ప‌ట్టు ఉండ‌డం.. ప్ర‌జ‌ల్లోనూ సానుకూల‌త ఉండ‌డం.. వివాద ర‌హితంగా ఉండ‌డం అన్నింటికీ మించి కేసీఆర్ ప‌ట్ల విధేయ‌త వంటివి క‌లిసి వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి.. చివ‌రి నిముషంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.