Begin typing your search above and press return to search.

ఈ బుల్లి కారు ఇప్పుడు హాట్ టాపిక్.. తెలిసినోళ్లు కొనేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 April 2022 3:28 AM GMT
ఈ బుల్లి కారు ఇప్పుడు హాట్ టాపిక్.. తెలిసినోళ్లు కొనేస్తున్నారు
X
దేశంలో ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాల హవా నడుస్తోంది. కాస్తంత ధరలు ఎక్కువగా ఉన్నాయే కానీ.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్.. డీజిల్ ధరల పుణ్యమా అని ఎలక్ట్రికల్ వాహనాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా వాహనాలు కొనే వారంతా ఎలక్ట్రికల్ వాహనం గురించి ఆలోచిస్తున్నారు. ఇలాంటి వేళ.. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఒక ఎలక్ట్రికల్ కారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుజ్జిగా ఉంటూ.. రోటీన్ కారుకు కాస్త భిన్నంగా.. ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఈ కారు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

చిన్నదిగా ఉండటం.. ధర అందుబాటులో ఉండటంతో పాటు.. ఫీచర్ల పరంగానూ రాజీ పడకపోవటం ఒక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఆటో మాదిరే మూడు చక్రాలు ఉండే ఈ కారు కాస్తంత డిఫరెంట్. ఆటో మాదిరి ముందు ఒక చక్రం.. వెనుక రెండు చక్రాలుగా కాకుండా.. ముందు రెండు చక్రాలు.. వెనుక ఒక చక్రంతో దీన్ని డిజైన్ చేశారు. గత ఏడాదే మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. మారిన పరిస్థితుల్లో ఇప్పుడీ కారు అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. ముంబైకి చెందిన ఆటోమొబైల్‌ సంస్థ స్ట్రోమ్‌ మోటార్స్‌ 'స్టోమ్‌ ఆర్‌3' పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఈ కారు పొడువు 2915 ఎంఎంగా ఉంటే.. వెడల్పు 1519, ఎత్తు 1545 ఎంఎంగా ఉంది. షట్కోణంలో డోర్స్ ఉండే ఈ కారుకు 1990లో మెర్సిడెజ్ బెంజ్ కార్లకు ఉండే లగ్జరీ స్క్రీన్ ఫీచర్లు ఉండటం గమనార్హం.

కారులో మూడు స్క్రీన్లు.. ఇన్ఫోటైన్ మెంట్.. ఇన్ స్ట్రుమెంట్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒక స్క్రీన్ ఏడు అంగుళాలు.. మిగిలిన రెండు స్క్రీన్లు 4.3, 2.4 అంగుళాలుగా ఉంది. 4జీ కనెక్టివిటీతో నావిగేషన్.. వాయిస్ కంట్రోల్.. సిగ్నల్ కంట్రోలింగ్ సపోర్టు సిస్టమ్ అందుబాటులో ఉంది.

ఇలా ఫీచర్లకు ఏ మాత్రం కొదవ లేని ఈ బుల్లి కారు ధర ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.4.5 లక్షలుగా చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ధరతో లభ్యమయ్యే ఈ కారు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. 550 కేజీల బరువు ఉండే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 80కి.మీ. చెబుతున్నారు.

మూడు వేర్వేరు లి అయాన్ బ్యాటరీ కాన్ఫిగరేషన్ లతో 120, 160, 200 కి.మీ. రేంజ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఏమైనా.. ఈ కారు గురించి తెలిసినంతనే కొనుగోలు చేసేలా ఉండటంతో ఇటు వ్యాపార వర్గాల్లోనూ.. అటు బుకింగ్స్ విషయంలోనూ మిగిలిన కార్లకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు.