Begin typing your search above and press return to search.

ఇక‌పై బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి వ‌ర‌కూ రెస్టారెంట్లు!

By:  Tupaki Desk   |   25 July 2019 4:44 AM GMT
ఇక‌పై బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి వ‌ర‌కూ రెస్టారెంట్లు!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అని చెప్పినా.. ఇప్ప‌టికి ఆ ప్రాంతంలో ప్ర‌జాజీవితం పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. విజ‌య‌వాడ (బెజ‌వాడ‌) కేంద్రంగానే కార్య‌క‌లాపాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న ప‌రిస్థితి. ఇక‌.. రాజ‌ధాని ప్రాంతానికి వెళ్లి వ‌చ్చే వారిలో ఎక్కువ‌మంది గుంటూరు కంటే బెజ‌వాడ‌కే ప్రాధాన్య‌త ఇస్తుంటారు. వ్యాపార‌ప‌రంగా కానీ.. వ‌స‌తుల ప‌రంగా కానీ బెజ‌వాడలో సానుకూల‌త‌లు ఎక్కువ‌.

అలాంటి విజ‌య‌వాడ‌లో హోట‌ళ్లు.. రెస్టారెంట్ల‌ను రాత్రి ప‌ది గంట‌లు అయ్యేస‌రికి క‌చ్ఛితంగా బంద్ చేయిస్తున్న పోలీసుల తీరుపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. న‌గ‌రాలుగా ప‌రిణామం చెందే ప‌ట్ట‌ణాల్లో నైట్ లైఫ్ ఎక్కువ‌గా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాత్రి ప‌ది గంట‌ల‌కే హోట‌ళ్లు.. రెస్టారెంట్లు మూసేయటం కార‌ణంగా వ్యాపారులు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోతున్నారు.

నిజానికి 2018 అక్టోబ‌రులో జారీ చేసిన జీవో ప్ర‌కారం అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ హోట‌ళ్లు.. రెస్టారెంట్లు తెరిచి ఉంచే అవ‌కాశం ఉన్నా.. పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌ని ప‌రిస్థితి. దీంతో.. విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ దృష్టిని త‌మ స‌మ‌స్య గురించి తెలియ‌జేయ‌టం.. అర్థ‌రాత్రి వ‌ర‌కూ హోట‌ళ్లు.. రెస్టారెంట్లు ఓపెన్ చేసి ఉండాల్సిన అవ‌స‌రాన్ని వివ‌రించ‌టంతో ఆయ‌న‌.. సానుకూలంగా స్పందించారు. ఇక‌పై రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ ఓపెన్ చేసేందుకు అవ‌స‌ర‌మైన అనుమ‌తిని ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి వ‌ర‌కూ హోట‌ళ్లు.. రెస్టారెంట్లు ఓపెన్ అయ్యే ప‌రిస్థితి.