Begin typing your search above and press return to search.

ఎమ్మార్పీ కంటే బాదుడు ఇక అధికారికం

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:45 AM GMT
ఎమ్మార్పీ కంటే బాదుడు ఇక అధికారికం
X
దేశంలో ఏ వ‌స్తువ అయినా ఎమ్మార్పీ ధ‌ర‌కు మాత్ర‌మే అమ్మాల‌న్న‌ది రూల్‌. అది అంద‌రికి తెలిసిందే. అయితే.. తెలిసిన మాట‌కు మ‌రో విష‌యాన్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్ర‌కారం.. ఎమ్మార్పీ ధ‌ర కంటే అధికంగా వాట‌ర్ బాటిల్స్ అమ్మొచ్చ‌ని తీర్పును ఇచ్చింది.

ఎమ్మార్పీ కంటే అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే చ‌ట్ట‌ప్రకారం చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌న్న రూల్‌ కి తాజా తీర్పు మిన‌హాయింపు కానుంది.

భార‌త హోట‌ల్‌.. రెస్టారెంట్ సంఘాల స‌మాఖ్య కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దాఖ‌లు చేసిన స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ ను విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిస్తూ.. హోట‌ళ్లు.. రెస్టారెంట్లు తాము అందించే వాట‌ర్ బాటిళ్ల మీద ఉన్న ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధ‌ర‌కు అమ్మొచ్చ‌ని.. దానిపై ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌వ‌ని తేల్చింది.

ఎందుకిలా అంటే.. ఇక్క‌డో ఆస‌క్తిక‌మైన ముచ్చ‌ట చెప్పాలి. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధ‌ర‌కు వాట‌ర్ బాటిల్ ను అమ్మ‌కూడ‌ద‌న్న‌ది నిజ‌మే కానీ.. త‌మ రెస్టారెంట్ల‌లో వాట‌ర్ బాటిల్ అమ్మిన‌ప్పుడు ఆ నీళ్ల‌ను ఉప‌యోగించేందుకు గ్లాసులు వినియోగ‌దారుడికి ఇవ్వాల్సి ఉంటుంద‌ని.. మ‌రి దాని క్లీనింగ్ ఖ‌ర్చులు.. నిర్వ‌హ‌ణ లాంటివి త‌మ‌కు భారంగా మార‌తాయ‌ని వాదించింది.

ఈ ఖ‌ర్చుల్ని దృష్టిలో పెట్టుకొని వాట‌ర్ బాటిల్‌ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధ‌ర‌కు అమ్మేలా త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాలని కోరింది. స‌మాఖ్య చేసిన వాద‌న‌కు సుప్రీం స‌రేన‌న‌టంతో ఎమ్మార్పీ ధ‌ర‌ను మాత్ర‌మే వ‌సూలు చేయాల‌న్న రూల్ ఇక‌పై మ‌రుగ‌న ప‌డ‌నుంది. సో.. హోట‌ల్‌.. రెస్టారెంట్ల‌కు వెళుతుంటే.. వాట‌ర్ బాటిల్ ధ‌ర మోత మోగే అవ‌కాశం ఉంది. జాగ్ర‌త్త‌గా చూసుకొని ఆర్డ‌ర్ ఇవ్వండి. రానున్న రోజుల్లో ఇలాంటి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల లెక్క చెప్పి వినియోగ‌దారుడిపై మ‌రెంత భారం మోపుతారో?