Begin typing your search above and press return to search.

ఒబామాకు సొంత పార్టీ వాళ్ల దెబ్బ పడింది

By:  Tupaki Desk   |   20 Nov 2015 9:23 AM GMT
ఒబామాకు సొంత పార్టీ వాళ్ల దెబ్బ పడింది
X
ప్రపంచానికి పెద్దన్న అయిన ఒబామాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన విధానాల్ని సొంత పార్టీకి చెందిన సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరం మీద ఉగ్రవాదులు దాడి చేయటం.. ఈ దాడిలో అమాయకులైన 119 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఐఎస్ మీదా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మరోవైపు.. ప్యారిస్ మీద జరిగిన ఉగ్రదాడిలో సిరియా నుంచి శరణార్థులుగా వచ్చిన వారి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అమెరికాకు శరణార్థుల్ని అనుమతించాలన్న వాదనకు ఒబామా మద్దతు పలికారు. దీనికి ఆయన సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకించటం గమనార్హం. సిరియా నుంచి వచ్చే శరణార్థుల్ని అనుమతించే విషయంలో సెనట్ లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమైంది.

ఒబామా నేతృత్వం వహించే డెమోక్రాటిక్ పార్టీకి చెందిన 47 మంది ఒబామా నిర్ణయాన్ని వ్యతిరేకించటం విశేషం. ప్యారిస్ ఘటన తర్వాత సమావేశమైన సెనెట్ శరణార్థులపై చర్చించి ఓటింగ్ పెట్టినప్పుడు.. ఒబామా నిర్ణయానికి అనుకూలంగా 137 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 289 ఓట్లు వేశారు. మరో తొమ్మిది ఓట్లు కానీ వస్తే.. అమెరికా అధ్యక్షుడికి ఉండే విశేష అధికారానికి కూడా కళ్లెం వేసే అవకాశం ఉంది.

సెనెట్ వ్యతిరేకించిన విధానాల్ని సైతం.. అమెరికా అధ్యక్షుడికి ఉండే విశేష అధికారాలతో తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకునే వీలుంది. అయితే.. అధ్యక్షుడి నిర్ణయాన్ని మూడింట రెండు వంతులు కానీ వ్యతిరేకిస్తే.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే వీల్లేదు. తాజాగా ఎదురైన వ్యతిరేకత నేపథ్యంలో.. సిరియా నుంచి వచ్చే శరణార్థుల విషయంలో ఒబామా ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.