Begin typing your search above and press return to search.

శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లిన ఫాతిమా బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

By:  Tupaki Desk   |   20 Oct 2018 3:30 AM GMT
శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లిన ఫాతిమా బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
X
గ‌డిచిన రెండు వారాలుగా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం వార్త‌ల్లో నిలిచింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌లు స్వ‌చ్ఛందంగా రోడ్ల మీద‌కు రావ‌టం ఒక ఎత్తు అయితే.. అలా వ‌చ్చిన వారెవ‌రూ త‌మ జీవితంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఆందోళ‌న‌ల కోసం.. త‌మ సంప్ర‌దాయాల్ని కాపాడుకోవ‌టం కోసం రోడ్ల మీద‌కు వ‌చ్చిన వారు కాదు. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. మీడియాలో బాగా క‌నిపించేలా ప్లాన్ చేయ‌టం.. మీడియా మీద త‌మకున్న ప‌ర‌ప‌తిని.. భావ‌సారుప్య‌త ఉన్నోళ్ల‌ను వెతికి మ‌రీ.. మ‌న ధ‌ర్మాల్ని మ‌నం ప్రొజెక్టు చేసుకోక‌పోతే ఎలా? అంటూ ప్లాన్ చేసినోళ్లు ఎంత మాత్రం కాదు.

త‌మ మ‌న‌సులోని బాధ‌ను.. ఆవేద‌న‌ను.. శాంతియుతంగా ప్ర‌ద‌ర్శించాల‌నే వారే త‌ప్పించి ఇంకే ల‌క్ష్యం లేనోళ్లు. తాము న‌మ్మి ఎన్నుకున్న ప్ర‌భుత్వ‌మే.. త‌మ మ‌నోభావాలు దెబ్బ తినేలా.. భావోద్వేగాలు స్పృశించేలా వ్య‌వ‌హ‌రించ‌టాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని వారిగా చెప్పాలి.

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దర్శ‌నం విష‌యంలో నాణెనికి ఒక‌వైపు క‌నిపించే వాస్త‌వం. మ‌రి నాణెనికి రెండో ముఖం మాదిరి.. ఈ వివాదానికి సంబంధించి ఉన్న మ‌రో అంశాన్ని తెలుసుకోవాల్సిందే. జ‌ర్న‌లిస్టుల పేరుతో.. యాక్టివిస్టుల పేరుతో కొంద‌రు.. మ‌హా అయితే ఐదుగురికి మించ‌రు. వారిలో ఒక‌రు ముస్లిం. మ‌రొక‌రు క్రిస్టియ‌న్.. వాళ్ల‌ను భ‌క్తుల రూపంలో.. వంద‌కు పైగా సాయుధులైన పోలీసులు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉంటూ శ‌బ‌రిమ‌ల కొండ మీద‌కు వ‌చ్చేలా చేయ‌టం.

అలా వ‌చ్చిన కొద్ది మంది మ‌హిల‌ల్లో ఒక‌రు రెహ‌నా ఫాతిమా? ఎవ‌రు ఈమె? ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ అవుతున్నాయి. వాటి మీద కొంద‌రు అస‌భ్య వ్యాఖ్య‌లు చేస్తున్న వాళ్లు లేక‌పోలేదు. నిర‌స‌న తెల‌పాలంటే విప‌రీత దోర‌ణులు అక్క‌ర్లేదు. చెప్పాల్సిన మాట‌ను సూటిగా చెబితే స‌రిపోతుంది. ఇంత‌కీ రెహ‌నా ఫాతిమా ఎవ‌రు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌.

శ‌బ‌రిమ‌ల దేవ‌లాయానికి అర కిలో మీట‌రు దూరం వ‌ర‌కూ వ‌చ్చేసి.. అక్క‌డి ప‌రిస్థితుల్ని చూశాక‌.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పోలీసు ఉన్న‌తాధికారి ఒక‌రు క‌లుగ‌జేసుకొని వెన‌క్కి పంపించ‌టంతో ఈ వివాదం ఒక కొలిక్కి వ‌చ్చింది. వాస్త‌వానికి శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌య ప్ర‌ధాన పూజారి సీన్లోకి వ‌చ్చి.. దేవుడి ద‌ర్శ‌నం చేయాల‌నుకుంటే.. గుడిని మూసేసి త‌న దారిన తాను పోతాన‌ని హెచ్చ‌రించ‌టంతో.. పోలీసులు వెన‌క్కి త‌గ్గారు.

ఇక‌.. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యానికి అర‌కిలో మీట‌రు దూరం వ‌ర‌కూ వ‌చ్చిన రెహ‌నా ఫాతిమా వివ‌రాల్లోకి వెళితే.. ఆమె యాక్టివిస్ట్ గా చెబుతారు. పురుషాధిక్య‌త‌ను ప్ర‌శ్నించేందుకు ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్నట్లు వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న పేరుంది. సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వ‌టం.. వివాదాల‌కు కేంద్రంగా ఉండ‌టం ఫాతిమాకు మామూలే.

ఆ మ‌ధ్య‌న కొజిక్కోడ్ కు చెందిన ఒక ఫ్రొఫెస‌ర్ అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య ఒక‌టి చేశారు. ఆడోళ్లు త‌మ పుచ్చ‌కాయ‌ల్లాంటి స్తనాల్ని కచ్ఛితంగా పూర్తి బ‌ట్ట‌ల‌తో క‌వ‌ర్ చేసుకోవాల‌న్నాడు. అంతే.. అందుకు నిర‌స‌న‌గా ఆమె పుచ్చ‌కాయ ముక్క‌ల్ని త‌న స్త‌నాల‌కు అడ్డుగా పెట్టుకొని ఫోటోలు తీసుకుంది. అయితే.. ఈ ఫోటోను ఫేస్ బుక్ రిజెక్ట్ చేసింది. దాన్ని ప్ర‌చురించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. అయినా.. కొంద‌రు అత్యుత్సాహ‌పు వీరులు.. వాటిని వాట్సాప్ ల ద్వారా వైర‌ల్ చేస్తున్నార‌నుకోండి.

ఇలా ఏ విష‌య‌మైనా.. ఊహించ‌ని విధంగా రియాక్ట్ కావ‌టం ఆమెకు అల‌వాటు. ఆ ప్ర‌య‌త్నంలో తెగింపుతో పాటు.. ప‌రిధులు.. ప‌రిమితులు గీసే వారికి త‌న ధిక్కార స్వ‌రం ఎంత వాడిగా.. వేడిగా ఉంటుందో చెప్పాల‌న్న‌ట్లు ఉంది. ఇలానే.. దాదాపు నాలుగేళ్ల క్రితం కిస్ ఆఫ్ ల‌వ్ అంటూ పోలీసుల మోర‌ల్ పోలీసింగ్ మీద పెద్ద ఆందోళ‌న జ‌రిగింది. దీన్లో భాగంగా ఆమె త‌న జీవిత‌స‌హ‌వాసి.. సినీ నిర్మాత అయిన మ‌నోజ్ శ్రీ‌ధ‌ర్ ను ముద్దాడుతూ ఫోటోలు తీసి వైర‌ల్ చేశారు.

అంతేనా.. ఓనం పండ‌గ సంద‌ర్భంగా అయ్యంతోల్ పులిక‌ళి అనే పులి వేష‌ధార‌ణ‌ను సాధారంగా మ‌గ‌వాళ్లే చేస్తారు. అలా కండిష‌న్లు పెడ‌తారా? అంటూ.. ఆ వేషాన్ని వేసేసింది. మ‌గాళ్లు డామినేష‌న్ ఉన్న ప్ర‌తి అంశంలోనూ తాను త‌ల‌దూరుస్తానంటూ ఆమె ఖండితంగా చెప్పాలి. ఇలా మాట్లాడ‌టం ఆమెకు అల‌వాటు. అలాంటి మాట‌ల్ని తాటికాయ‌లుగా వేసి.. సంచ‌ల‌నం చేయ‌టం.. వివాదం చేసి మ‌రింత చర్చ పేరుతో ర‌చ్చ చేయ‌టం కొన్ని మీడియా సంస్థ‌లకు అల‌వాటు. అలాంటి వారికి త‌గ్గ‌ట్లుగా ఫాతిమా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విమ‌ర్శ ఉంది.

ఇక‌.. వృత్తి విష‌యానికి వ‌స్తే బీఎస్ ఎన్ ఎల్ లో టెక్నిషియ‌న్ గా చేస్తుంటారు. 31 ఏళ్ల ఆమెకు ఇద్ద‌రు పిల్లలు. సంప్ర‌దాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె.. త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత మతం మీద విశ్వాసాన్ని.. భ్ర‌మ‌ల్ని వ‌దిలేసుకున్న‌ట్లుగా ఆమె సోష‌ల్ మీడియా అకౌంట్ గోడ మీద రాసుకున్నారు. బ్రేక్ ద రూల్స్ అన్నదాని ప్ర‌ముఖంగా పెట్టుకోవ‌టం ద్వారా.. తానేంట‌న్న‌ది చెప్ప‌క‌నే చెబుతుంది.

మ‌హిళ‌ల్ని నిరోధించే అయ్య‌ప్ప గుడిలోకి ఎంట‌ర్ కావ‌టం ద్వారా.. మ‌హిళ‌ల్ని నిరోధించ‌లేర‌న్న మాట‌ను చెప్పాల‌న్న ఆమె త‌ప‌న‌కు కేర‌ళ స‌ర్కారు తోడైంది. అంతే.. విజ‌య‌న్ స‌ర్కారు తీరును ఎప్ప‌టికి మ‌ర్చిపోలేని రీతిలో.. ప్ర‌జ‌ల సెంటిమెంట్లతో త‌మ‌కే మాత్రం సంబంధం లేద‌న్న విష‌యాన్ని ఫ్రూవ్ చేసేలా ఆమె శ‌బ‌రిమ‌లకు వెళ్లారు. గుడిలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత అత్యుత్సాం ప్ర‌ద‌ర్శించే ఆమె మిస్ అయిన పాయింట్ ఏమంటే.. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి మ‌హిళ‌ల్ని అనుమ‌తించ‌ర‌న్న‌ది ఉత్త‌మాట‌. అక్క‌డి గుడి ఆచారంలో భాగంగా.. మ‌హిళ‌ల్లో కొన్ని వ‌య‌స్కుల వారిని మాత్రం ప్ర‌వేశం లేదంటారు కానీ.. మిగిలిన వారంద‌రిని అనుమ‌తిస్తార‌న్న‌ది మ‌ర్చిపోవ‌టం. తెగింపు పేరుతో బ‌రితెగింపుతో వ్య‌వ‌హ‌రించ‌టం ఫాతిమాకు అల‌వాట‌న్నా ఆమె ప‌ట్టించుకోదు. ప‌ట్టించుకుంటే.. ఇంత చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దుగా?